లొకేషన్ తప్పుగా పెట్టినందుకు లక్షల్లో బిల్లు వేసిన ఉబర్

లొకేషన్ తప్పుగా పెట్టినందుకు లక్షల్లో బిల్లు వేసిన ఉబర్

ఈ మధ్య కాలంలో కాస్త దూరం వెళ్లాలన్నా ఆటో, బైక్, కారు.. ఇలా బుక్ చేసుకొని వెళ్లడం షరా మామూలైపోయింది. ఓలా, ఉబర్, ర్యాపిడో అంటూ ఎన్నో సర్వీసులు తమ ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బ్రిటన్ కు చెందిన 22ఏళ్ల ఆలివర్ కల్పన్ అనే వ్యక్తి కూడా అందర్లాగానే తన ఆఫీసు నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే కేవలం 6 కి.మీ. ప్రయాణించినందుకు అతనికి ఉబర్ ఏకంగా 32లక్షల బిల్లు వేయడంతో ఆ కస్టమర్ అవాక్కయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే... ఆఫీస్ అనంతరం 6 కి.మీ.దూరంలో ఉన్న పబ్ కి ఆలివర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఫ్రెండ్స్ తో పార్టీలో పాల్గొన్న ఆ వ్యక్తి కొంచెం డ్రింక్ చేశాడు. ఆ తర్వాత ఆలివర్ క్యాబ్ ఎక్కి తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. అయితే అతని క్రెడిట్ కార్డు ఉబర్ అకౌంట్ కు ముందే లింక్ అయ్యి ఉండడంతో బిల్లు ఆటోమెటిక్ గా అతని ఖాతా నుంచి కట్ అయింది. దాంతో తన ప్లేస్ రావడంతో క్యాబ్ దిగి వెళ్లిపోయాడు. తాగిన మత్తులో ఉన్న ఆలివర్.. తన ఖాతా నుంచి ఎంత మనీ కట్ అయ్యిందో గమనించలేకపోయాడు. అయితే పొద్దున లేచిన తర్వాత తన ఫోన్ లో బ్యాలెన్స్ చూసుకొని ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి ఉబర్ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు.

అయితే అంత షాక్ కావడానికి కారణమేంటో తెలుసా.. ఉబర్ అతనికి ఏకంగా 39,317 డాలర్ల ( మన కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు) బిల్లు వేసింది. అయితే ఆ వ్యక్తి ఖాతాలో అంత అమౌంట్ లేకపోవడంతో పేమెంట్ రిజెక్ట్ అయిందని కస్టమర్ సర్వీస్ తెలిపారు. ఆ బిల్లు కట్టమని కోరారు. అయితే తాను వెళ్లింది కేవలం 6 కిలో మీటర్లే కదా అని ఫిర్యాదు చేసిన ఆ కస్టమర్ కు మరో షాక్ తగిలింది. డ్రాపింగ్ లొకేషన్ ను పరిశీలించిన ఉబర్ సిబ్బంది.. కల్పన్ క్యాబ్ డ్రాపింగ్ మాంచెస్టర్ లోని విచ్ వుడ్ అయితే.. ఉబర్ యాప్ లో మాత్రం ఏకంగా వేల కిలో మీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలో ఉన్న విచ్ వుడ్ పార్క్ గా చూపించింది. అంటే మాంచెస్టర్ నుంచి ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు ప్రయాణించిన కారణంగా రూ.32 లక్షల బిల్లు వేసినట్టు ఉబర్ స్పష్టం చేసింది. అయితే దీనిపై స్పందించిన ఆలివర్... ఇంకా నయం.. నా కార్డులో అంత డబ్బు లేదు కాబట్టి బతికిపోయా.. లేదంటే రీఫండ్ కోసం తిరగాల్సి వచ్చేదని నిట్టూర్చాడు.