యూకో బ్యాంక్ ఐఎంపీఎస్ స్కాం.. 67 చోట్ల సీబీఐ సోదాలు

యూకో బ్యాంక్ ఐఎంపీఎస్ స్కాం.. 67 చోట్ల సీబీఐ సోదాలు

న్యూఢిల్లీ: యూకో బ్యాంకులో జరిగిన రూ.820 కోట్ల విలువైన అనుమానాస్పద ఐఎంపీఎస్​ లావాదేవీల కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం రాజస్థాన్, మహారాష్ట్రలోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గత ఏడాది నవంబర్​10 నుంచి 13 మధ్య 7 ప్రైవేటు బ్యాంకులకు చెందిన 14,600 అకౌంట్ల నుంచి 41 వేల యూకో బ్యాంకు అకౌంట్లలో రూ.820 కోట్లు ఐఎంపీఎస్​ద్వారా తప్పుగా జమయ్యాయి. కొందరు కస్టమర్లు ఆ డబ్బులను డ్రా చేసుకున్నారు. దీనిపై యూకో బ్యాంకు అదే నెలలో  సీబీఐకి ఫిర్యాదు చేసింది. 

నవంబర్ 21న సీబీఐ కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్​ చేసింది. 2023 డిసెంబర్ లో కోల్‌కతా, మంగళూరులోని కొందరు వ్యక్తులు, యూకో బ్యాంక్ అధికారులకు సంబంధించిన 13 ప్రాంతాల్లో సోదాలు చేసింది. తాజాగా రాజస్థాన్ లోని జోధ్‌పూర్, జైపూర్, జలోర్, నాగౌర్, బార్మర్, ఫలోడితో పాటు మహారాష్ట్రలోని పుణేలో రెయిడ్స్​చేపట్టింది. సోదాలలో దాదాపు 130 డాక్యుమెంట్లు, 40 ఫోన్‌లు, హార్డ్ డిస్క్ లు, ఇంటర్నెట్ డాంగిల్ సహా 43 పరికరాలను సీజ్ చేసింది. బ్యాంక్ యాప్ ను మెయింటైన్ చేసిన  ఇద్దరు సపోర్ట్ ఇంజనీర్లపైనా ప్రత్యేకంగా  కేసు పెట్టింది.