జడ్చర్ల టౌన్ వెలుగు: ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద పెంచిన మొత్తంతో కలిపి రూ. 338 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లు రిజిస్టర్ చేసి ఇవ్వాలని కోరామని చెప్పారు. హైదరాబాద్ లోని జలసౌధలో ఆదివారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై జరిగిన అధికారిక సమీక్షా సమావేశం లో ఈ విషయాలపై చర్చించనట్టు ఎమ్మెల్యే వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేయకపోగా భూములు లేని వారికి కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పరిహారాలు ఇచ్చారని చెప్పారు. లేని వారికి కూడా ఇళ్లు ఉన్నాయని రికార్డులు క్రియేట్ చేసి వారికి కూడా పరిహారం చెల్లించాలని జాబితాలు తయారు చేశారని విమర్శించారు. వారికి ఆర్ ఆర్ చట్టం కింద నోటీసులు కూడా జారీ చేశామని, అనర్హుల పేర్లను తీసేసినట్టు చెప్పారు.
