- ఏదులసహా మిగతా అన్నింటికీ పరిహారం దాదాపు పూర్తి
- ఉద్దండాపూర్‌లో 2,850
- రీలొకేషన్లకు పరిహారం ఎక్కువ
- ఈ సీజన్‌లోనే ప్రాజెక్టును పూర్తిచేసేలా ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని అడ్డంకులను వీలైనంత తొందరగా తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ ప్రాజెక్టుకు ప్రస్తుతం భూసేకరణే సమస్యగా మారింది. అందులో ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన భూమి సేకరణలోనే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే కుటుంబాలు ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పరిహారంపై అక్కడి ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎన్నో ఏండ్లుగా పరిహారం పెంపు కోసం డిమాండ్ చేస్తూవస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పరిహారాన్ని రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచింది. ఇందుకు సంబంధించిన నిధుల విడుదల, అంచనాల పెంపునకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. రూ.587 కోట్లకు ఒకే చెప్పింది. ఆ మొత్తం త్వరలోనే విడుదలయ్యి ప్రాజెక్టుకు సమస్యగా మారిన పరిహారానికి సంబంధించిన ఇబ్బందులు తొలగనున్నాయి.
ఉద్దండాపూర్ కే రూ.500 కోట్లు
ప్రాజెక్టులో ఇండ్లు, భూములు కోల్పోయిన కుటుంబాలు ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 5,000 కుటుంబాలు ప్రాజెక్ట్ డిస్‌ప్లేస్డ్ ఫ్యామిలీస్ పీడీఎఫ్) జాబితాలో ఉండగా.. అందులో 2850 పీడీఎఫ్‌లు ఉద్దండాపూర్ కింద ఉన్నాయి. ఇప్పటికే రూ.397.65 కోట్లు పరిహారం కోసం చెల్లించగా.. మరో రూ.500 కోట్లు ఈ ఒక్క రిజర్వాయర్ కిందనే చెల్లించాల్సి ఉంది.
రూ.395.92 కోట్లు పీడీఎఫ్, రూ.104.08 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోసం ఖర్చు చెయ్యాల్సి ఉన్నది. ఇక నార్లాపూర్ రిజర్వాయర్ కిండ్ రూ.32.15 కోట్లు, ఏదుల కింద రూ.30.12 కోట్లు, వట్టెం కింద రూ.25 కోట్లు పరిహారం కింద చెల్లించనున్నారు. ఉద్ధండాపూర్ వరకు పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. ఈ సీజన్ లోనే ఆ పనులు పూర్తి చేసి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు మంచినీటిని సరఫరా చెయ్యాలని నిశ్చయంతో ఉంది. పెండింగ్ లో ఉన్న మరో 196.64 ఎకరాల భూసేకరణకు రూ.50 కోట్లు కేటాయించింది.
