ఉద్ధవ్​ థాక్రే ఇంటిబాట.. రాజీనామాకు సిద్ధమన్న సీఎం

ఉద్ధవ్​ థాక్రే ఇంటిబాట.. రాజీనామాకు సిద్ధమన్న సీఎం
  • ఉద్ధవ్​ థాక్రే ఇంటిబాట 
  • రాజీనామాకు సిద్ధమన్న సీఎం.. అధికార నివాసం ఖాళీ
  • మహారాష్ట్రలో ముదిరిన రాజకీయ సంక్షోభం
  • ఏక్​నాథ్​ షిండే శిబిరంలోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు
  • 34 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్​
  • ఎంవీఏ నుంచి శివసేన బైటకు రావల్సిందే: షిండే 
  • మాదే అసలైన శివసేన: గవర్నర్ కు రెబెల్స్ లేఖ


ముంబై/ గౌహతి:   మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సిందేనని ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. బుధవారం తెల్లారేసరికల్లా సూరత్ నుంచి గౌహతి చేరుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు.. ఏక్ నాథ్ షిండేనే తమ నాయకుడని ప్రకటించారు. తమదే అసలైన శివసేన అంటూ తీర్మానం చేసి, గవర్నర్ కు లేఖను పంపారు. సాయంత్రం కల్లా వీరికి తోడుగా మరో నలుగురు సేన ఎమ్మెల్యేలు గౌహతి క్యాంపులో చేరారు. మరోవైపు సంక్షోభం సమసిపోవాలంటే రెబెల్ నేత షిండేను సీఎం చేయాలని థాక్రేకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సూచించినట్లు సాయంత్రం వార్తలు వచ్చాయి.  ఈ నాటకీయ పరిణామాల మధ్య బుధవారం రాత్రి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిబాట పట్టారు. అధికారిక బంగ్లా ‘వర్షా’ను ఖాళీ చేసి సొంత నివాసం ‘మతోశ్రీ’కి వెళ్లిపోయారు. దీంతో థాక్రే రాజీనామా చేస్తారని, లేకపోతే అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, సొంత నివాసానికి వెళ్లినా థాక్రేనే సీఎంగా ఉంటారని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అవసరమైతే అసెంబ్లీలో బల నిరూపణకు కూడా సిద్ధమన్నారు. 


తెల్లారేకల్లా గౌహతికి రెబెల్స్  


సోమవారం రాత్రి ముంబైలో గాయబ్ అయి, గుజరాత్ లోని సూరత్ లో ప్రత్యక్షమైన సేన రెబెల్ ఎమ్మెల్యేలు మళ్లీ తెల్లారేకల్లా మకాం మార్చారు. బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలోని గువాహటి సిటీకి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు చార్టర్డ్ ఫ్లైట్ లో చేరుకున్నారు. సిటీలోని ఓ హోటల్ లో క్యాంపు పెట్టారు. బుధవారం సూరత్ కు చేరుకున్న మరో నలుగురు సేన ఎమ్మెల్యేలు సాయంత్రం కల్లా గువాహటికి చేరుకుని, రెబెల్ క్యాంపులో చేరారు. మధ్యాహ్నం గువాహటి నుంచే 30 మంది సేన రెబెల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. ఏక్ నాథ్ షిండేనే తమ నాయకుడని పేర్కొన్నారు.  


మాదే అసలైన శివసేన: గవర్నర్ కు రెబెల్స్ లేఖ 


గువాహటిలోని ఓ హోటల్ లో బుధవారం సాయంత్రం సమావేశమైన సేన రెబెల్ ఎమ్మెల్యేలు తమ శాసన సభా పక్ష నేతగా ఏక్ నాథ్ షిండేను ఎన్నుకున్నట్లు తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారికి లేఖ రాశారు. తిరుగుబాటు నేపథ్యంలో శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తొలగించినట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించగా.. తాజాగా బుధవారం తమదే అసలైన శివసేన అని రెబెల్ ఎమ్మెల్యేలు గవర్నర్ కు తెలిపారు. పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభును తొలగించి, ఆ పదవిలో కొత్తగా ఎమ్మెల్యే భరత్ గోగవాలేను నియమించినట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. శివసేనకు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు ఆ లేఖపై సంతకాలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా, ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురికాకుండా ఉండాలంటే షిండేకు పార్టీలో రెండింట మూడొంతుల మంది (37) ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం కానుంది. అయితే, తనకు 46 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని షిండే చెప్పారు.


రాజీనామాకు రెడీ అన్న థాక్రే  


అసమ్మతి ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరైనా తనను సీఎం కుర్చీ నుంచి దిగిపొమ్మంటే సంతోషంగా రాజీనామా చేస్తానని థాక్రే అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనపై తిరుగుబాటు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ‘‘ఇప్పుడే సీఎం పదవిని వదలుకునేందుకు సిద్ధంగా ఉన్నా. పదవులు వస్తాయి. పోతాయి. కానీ కొత్త సీఎం శివసేన నుంచే అవుతారని మీరు ప్రామిస్ చేయగలరా?” అని నేరుగా ఏక్ నాథ్ షిండేను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘రండి. ఇక్కడికొచ్చి నా ముఖం మీదే రాజీనామా చేయాలని అడగండి. ఈ సీఎం పదవి నాకు అనుకోకుండా వచ్చింది. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండగా.. సొంత పార్టీ నేతలే కాదనుకుంటే ఏం చేయగలను?” అని విచారం వ్యక్తం చేశారు.  

ఎంవీఏ నుంచి బయటకు రావాల్సిందే: షిండే 


‘‘శివసేన, శివసైనికుల మనుగడ కోసం ఫ్రంట్ నుంచి బయటకు రావడం అత్యవసరం. రెండున్నరేండ్లలో సంకీర్ణ కూటమిలోని మిత్రపక్షాలే లాభపడ్డాయి. అందుకే ఇప్పుడు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది” అని ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు. సిద్ధాంతపరంగా పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకట్టడాన్ని తప్పుపట్టారు.  


సీఎంకు, గవర్నర్ కు కరోనా 


అటు సీఎం థాక్రే, ఇటు గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కరోనా బారిన పడ్డారు. అనారోగ్య సమస్యలతో గవర్నర్ ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో సీఎం థాక్రే బుధవారం వర్చువల్ గా కేబినెట్ భేటీ నిర్వహించారు.   


సేన ఎమ్మెల్యే ‘కిడ్నాప్’ ఆరోపణలు  


సూరత్​కు షిండే వెంట వెళ్లిన సేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ బుధవారం అనూహ్యంగా నాగపూర్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, తప్పించుకొచ్చానని మీడియాతో చెప్పారు. తాను ఉద్ధవ్ థాక్రే వెనకే ఉంటానని ప్రకటించారు. సూరత్ లో తనకు గుండెపోటు వచ్చిందని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారని, పాయిజన్ ఇచ్చి చంపేందుకు కుట్ర జరిగిందన్నారు. 


రెబెల్స్ పై సుప్రీంలో పిటిషన్


శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు.


సర్కార్ ఏర్పాటుపై బీజేపీ చర్చలు 


సంక్షోభం నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ వేర్వేరుగా శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించాయి. తమ ఎమ్మెల్యే లంతా కలిసికట్టుగా ఉన్నారని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యా రు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 37 మంది మద్దతు అవసరం కాగా, ఆ లోటు రెబెల్ ఎమ్మెల్యేలతో తీరే అవకాశంపై చర్చించినట్లు తెలిసింది.