అసెంబ్లీలో కూడా ఉద్ధవ్ థాక్రే పాస్

అసెంబ్లీలో కూడా ఉద్ధవ్ థాక్రే పాస్

ముంబై: శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే ఆధ్వర్యంలోని ‘మహా వికాస్ ఆగాధీ’ అసెంబ్లీ ఫ్లోర్​ టెస్టులో పాస్​ అయింది. శనివారం జరిగిన బలపరీక్షలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ కూటమికి 169 మంది సభ్యులు మద్దతు తెలిపారు. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు రూల్స్​కు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ సభను బాయ్​కాట్​ చేసింది. మరో నలుగురు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేదు. గవర్నర్​ ఆదేశాల మేరకు శనివారం సభ ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ సీఎం అశోక్​ చవాన్​ బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, ఎన్సీపీ, శివసేన సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏఐఎంఐఎం, సీపీఎం, ఎంఎన్ఎస్​ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదని ప్రొటెం స్పీకర్​ దిలీప్​ వాల్సే ప్రకటించారు. ఓటింగ్​ కు సిద్ధమవుతుండగా బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం నిబంధనల ప్రకారం జరగలేదని, బల పరీక్ష నిర్వహించొద్దని నినాదాలు చేశారు. గవర్నర్​ ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లోర్​ టెస్ట్​ నిర్వహించి తీరతామని ప్రొటెం స్పీకర్​ తేల్చిచెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్​ చేశారు. తర్వాత జరిగిన ఫ్లోర్​ టెస్ట్​లో హెడ్​కౌంట్​ ద్వారా ఉద్ధవ్​ థాక్రేకు 169 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్లు ప్రొటెం స్పీకర్​ ప్రకటించారు.

పేరెంట్స్ ను గుర్తుచేస్కోవడం నేరమా?:థాక్రే

బల పరీక్ష నెగ్గిన తర్వాత.. తనపై నమ్మకముంచిన సభ్యులందరికీ థ్యాంక్స్ అని సీఎం ఉద్ధవ్​ థాక్రే చెప్పారు. మీ ఆశీర్వాదం లేకుంటే నేనిక్కడ ఉండే వాడినే కాదంటూ రాష్ట్ర ప్రజలకూ ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రమాణ స్వీకారంలో ఛత్రపతి శివాజీతో పాటు బాలా సాహెబ్​ థాక్రే పేర్లను ప్రస్తావించడంపై బీజేపీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. శివాజీని స్మరించుకోవడం, తల్లిదండ్రులను గుర్తుచేసుకోవడం నేరమా అంటూ బీజేపీని నిలదీశారు. శివాజీ పేరెత్తితే బీజేపీ ఉలిక్కిపడుతోందని ఎగతాళి చేశారు. తల్లిదండ్రులను స్మరించుకోని వ్యక్తికి ఈ భూమ్మీద ఉండే హక్కు లేదని థాక్రే విమర్శించారు.

బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీని ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రూల్స్​ ప్రకారం జరగలేదని ఆరోపిస్తూ బీజేపీ శాసన సభ పక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్​ విమర్శించారు. ప్రొటెం స్పీకర్​ మార్పునూ ఆయన తప్పుబట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ‘‘రెగ్యులర్​ స్పీకర్​ ఉంటే బలపరీక్షలో ఓడిపోతామని భయపడే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ కూటమి భయపడింది.  ప్రొటెం స్పీకర్​ను మార్చి మరో ప్రొటెం స్పీకర్​ను నియమించడం దేశచరిత్రలోనే మొదటిసారి” అని బీజేపీ ఆరోపించింది.

స్పీకర్ పోస్ట్​కు కాంగ్రెస్​, బీజేపీ పోటీ

మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్​పదవికి ఆదివారం  ఎన్నిక జరగనుంది.  కాంగ్రెస్​ కేండిడేట్​గా ​నానా పటోలె , బీజేపీ అభ్యర్థిగా కిషన్​ కథోరే పోటీలో ఉన్నారు. పటోలె విదర్భలోని శాకోలి ఎమ్మెల్యేగా గెలిచారు.  బీజేపీ కేండిడేట్​ కథోరే  ముర్బాద్​ఎమ్మెల్యేగా ఉన్నారు.