ఎన్డీఏ కూటమిలో ఆ మూడే బలమైన పార్టీలు:ఉద్ధవ్‌‌ థాక్రే

ఎన్డీఏ కూటమిలో ఆ మూడే  బలమైన పార్టీలు:ఉద్ధవ్‌‌ థాక్రే

ముంబై: నేషనల్‌‌ డెమొక్రాటిక్‌‌ అలయన్స్‌‌ (ఎన్డీఏ)లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ), ఇన్‌‌కం ట్యాక్స్‌‌, సీబీఐ ఈ మూడు మాత్రమే స్ట్రాంగ్‌‌ పార్టీలు అని శివసేన(యూబీటీ) చీఫ్‌‌ ఉద్ధవ్‌‌ థాక్రే అన్నారు. పార్టీ పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మణిపూర్‌‌‌‌ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని 
సందర్శించడానికి కూడా ప్రధాని మోదీ సిద్ధంగా లేరన్నారు. 

త్వరలో ఎన్నికలు రాబోతున్నందున బీజేపీకి తాము ఎన్డీఏ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందని, ఒకసారి ఎన్నికలు అయిపోయాక మళ్లీ మోదీ గవర్నమెంట్‌‌ అవుతుందన్నారు. ‘‘ఎన్డీఏలో ఉన్న 36 మిత్రపక్షాల్లో ఈడీ, సీబీఐ, ఇన్‌‌కంట్యాక్స్‌‌ పార్టీలు మాత్రమే చాలా బలమైనవి. కొన్ని పార్టీలకు ఒక్క ఎంపీ స్థానం కూడా లేదు” అని అన్నారు. మొదట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోహత్య నిషేధానికి చట్టం తేవాలని, ఆ తర్వాత యూనిఫాం సివిల్ కోడ్‌‌ గురించి ఆలోచన చేయాలని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నపుడు బీజేపీలో ఉన్న  అవినీతిపరులను కూడా శిక్షించాలని 
ఉద్ధవ్‌‌ డిమాండ్‌‌ చేశారు.