నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. ఎవరొస్తారో రండి చూస్కుందాం..

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. ఎవరొస్తారో రండి చూస్కుందాం..

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. 

స్టాలిన్ ఏమన్నారంటే..

సనాతన ధర్మాన్ని ఉదయనిధి స్టాలిన్ కరోనా, మలేరియా, డెంగీ జ్వరం, దోమలతో పోల్చారు.  సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. ఇలాంటి వాటిని వ్యతిరేకించడం కాదు, నాశనం చేయాలన్నారు.  సెప్టెంబర్ 2వ తేదీన  చెన్నైలో తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. 

అమిత్ షా ఫైర్

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. విపక్షాలకు హిందూ ధర్మాన్ని అవమానించడం ఇదే తొలిసారి కాదన్నారు. ప్రతిపక్షాలకు హిందూ ధర్మాన్ని అవమానించడం అలవాటైపోయిందని మండిపడ్డారు. I.N.D.I.A కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. విపక్షాలు  మైనారిటీల పేరు చెప్పుకుని  ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కానీ తాము మాత్రం నిరుపేదలు, వెనకబడిన వర్గాలు, దళితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 

ALSO READ :కుండపోత వర్షం.. స్కూళ్లకు హాలిడే

దేశ ద్రోహం..అరెస్ట్ చేయాలి..

ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ  దేశద్రోహంగా అభివర్ణించారు.  అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చినందుకు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపాలని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిక్ ఆకతాయి అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. భవిష్యత్, మంచి చెడు ఆలోచించకుండా సనాతన ధర్మం, హిందూమతంపై వ్యాఖ్యానించాడని ఎద్దేవా చేశారు.  తన జీవితంలో ఒక్కరోజు కూడా నిజాయితీగా పని చేయని వ్యక్తి అని చురకలంటించారు. 

చర్యలు తీసుకోవాలంటూ శివసేన లేఖ

'సనాతన ధర్మం వ్యాఖ్యలకు సంబంధించి ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ముంబై పోలీసులకు లేఖ రాసింది. లేఖలో  శివసేన నాయకుడు రాహుల్ నారాయణ్ కనాల్  ఓ మతానికి వ్యతిరేకంగా ఇటువంటి ప్రకటనలు చేయడం ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే అన్నారు. 

నా వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నా..

బీజేపీ విమర్శలపై ఉద‌య‌నిధి స్టాలిన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వ్యాఖ్యల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని స్పష్టం చేశారు.  ఎవ‌రో విమర్శలు చేస్తే తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని విమ‌ర్శించాన‌ని, దానిని నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మ‌రోసారి చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ప్రతి క్షణం చెబుతూనే ఉంటాన‌ని ప్రక‌టించారు. తాను మార‌ణ హోమాన్ని స‌హించనని చెప్పుకొచ్చారు. తనను విమర్శిస్తున్న కొందరు.. ద్రవిడాన్ని ర‌ద్దు చేయాల‌ని అంటున్నార‌ని.. అంటే డీఎంకే వాళ్లను చంపాలా అని నిల‌దీశారు.  కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాన మంత్రి మోదీ పిలుపు ఇస్తున్నారంటే అర్థం కాంగ్రెస్ వాళ్లను చంపాలా అని మండిప‌డ్డారు. స‌నాత‌న అంటే ఏమిటి..ఏదీ మార‌కూడ‌దు అని అర్థమని..కానీ ద్రవిడ ఇజం మోడ‌ల్ మార్పు కోసం పిలుపు ఇస్తుంద‌ని చెప్పారు. అంద‌రూ స‌మానంగా ఉండాల‌న్నదే త‌మ అభిమ‌త‌మ‌ని పేర్కొన్నారు. త‌ప్పుడు వార్తల‌ను ప్రచారం చేయ‌డంలో బీజేపీ ముందంజ‌లో ఉంటుంద‌న్నారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్రక‌టించారు.

ఉదయనిధి గతంలో విమర్శలు

బీజేపీపై విమర్శలు చేయడం ఉదయనిధికి ఇది కొత్తకాదు..గతంలో ఎఐఎడిఎంకె పార్టీ పేరుతో అమిత్ షా విమర్శించారు. ఎఐఎడిఎంకెలో  'ఎ' అంటే అమిత్ షా అని అర్థం వచ్చిందని, అన్నాదురై కాదని ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఎఐఎడిఎంకె పార్టీ ముసుగులో తమిళనాడులోకి చొరబడేందుకు బీజేపీ అనే విషపు పాముతో చూస్తోందని మండిపడ్డారు. బీజేపీ అడ్డుకునేందుకు ముందుగా ఎఊఎడీఎంకేను నామరూపాల్లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. బీజేపి పాలనలో లబ్ది పొందిన ఏకైక వ్యక్తి వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అని ఆరోపించారు. 

మోదీపై విమర్శలు..

115 మంది ప్రతిపక్ష నేతలను ప్రశ్నించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించుకుంటోందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ఈ ఏడాది జులైలో తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో బీజేపీపై విమర్శలు గుప్పించిన ఉదయనిధి స్టాలిన్..దమ్ముంటే తనపై దాడులు చేయాలని సవాల్ విసిరారు.

రామేశ్వరంలో కే. అన్నామలై పాదయాత్ర ప్రారంభంలో డీఎంకే వారసత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. తమ రాజకీయ వారసత్వాన్ని  ప్రశ్నిస్తున్న అమిత్ షా...బీసీసీఐలో తన కుమారుడి జైషాను ఎలా ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించారు. జైషా  బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడు? అతను ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు? అతను ఇప్పటివరకు ఎన్ని పరుగులు చేశాడు? అని నిలదీశారు.