ఉగాది: కొత్త ఆశలు..ఆకాంక్షలు

ఉగాది: కొత్త ఆశలు..ఆకాంక్షలు

ఈ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకొనే పండుగ ఉగాది. ఇది తెలుగువారి కొత్త సంవత్సరం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అనే అర్థాలు ఉన్నాయి. ఉగ (నక్షత్ర గమనానికి) ఆది (మొదలు) కాబట్టి, ఉగాది అంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. తెలుగు వారితో పాటు కర్ణాటకలోనూ ఉగాది వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు (మంగళవారం) నుంచి శ్రీ ప్లవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ రోజు నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం అందరికీ సిరి సంపదలు, సకల శుభాలు కలిగించాలని ఉగాది వేడుకల్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. 

సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి, సముద్రంలో దాక్కున్నాడని, విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చి, ఆ రాక్షసుడ్ని సంహరించి, వేదాలను తెచ్చి బ్రహ్మ దేవుడికి ఇచ్చిన రోజు కూడా ఇదే అని నమ్ముతారు. రుతువులన్నింటిలోకి విశిష్టమైనది వసంత రుతువు. అది కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఉగాది ప్రతిపాద తిథి నిన్న (ఏప్రిల్‌‌‌‌ 12) సోమవారం ఉదయం ఎనిమిదింటికి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది.

పండుగ రోజు ఏం చేయాలి

తెలుగు లోగిళ్లు అన్నీ ఉగాది పండుగ రోజు కొత్త కళ సంతరించుకుంటాయి. ప్రతి ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేస్తారు. ప్రతి గడపకు పూలదండలు, మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇంట్లో తమ ఇష్టదైవానికి పూజ చేసి, పిండి వంటలు నైవేద్యంగా పెడతారు. ప్రత్యేకంగా ఈ రోజు ‘ఉగాది పచ్చడి’ చేసుకోవడం ఆనవాయితీ. అలాగే భక్ష్యాలు, బూరెలు వంటి సంప్రదాయ తీపి వంటకాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉగాది పచ్చడి, పిండి వంటలు తిని సంతోషంగా గడుపుతారు. ఈ రోజు తీసుకునే ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలు వాత, కఫ దోషాల్ని తొలగిస్తాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. పంచాంగ శ్రవణం చేయడం కూడా మంచిదని నమ్ముతారు. ఈ రోజు నుంచే నవరాత్రులు మొదలవుతాయి. తొమ్మిదో రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు.