టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం 'ఉగ్రం' అనే మూవీలో నటిస్తున్నాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కి, అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఈ మూవీలో మిర్నా హీరోయిన్ గా కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 14న సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో బుల్లెట్ పై వచ్చిన నరేష్ ఆగ్రహంతో గన్ తీసి కాల్చడం..అది రిలీజ్ డేట్ గా మారడం ఆకట్టుకుంటోంది. ఈ గ్లిమ్స్ కు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం హైలైట్ గా నిలుస్తోంది.
ఇక అల్లరి నరేష్ గతంలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. కానీ ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలతోనూ తన సత్తాను చాటుతున్నాడు. అందుకు తాను నటించిన 'నాంది' సినిమానే నిదర్శనం. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో అల్లరి నరేష్ లోని కొత్త కోణం బయటపడింది. ఈ సినిమాతో సీరియస్ పాత్రలతోనూ మెప్పించగలనని ఆయన నిరూపించాడు. ఈ మూవీ తర్వాత నుంచి నరేష్ తన స్టైల్ మార్చుకున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ.. మంచి క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్నాడు. 'ఉగ్రం' చిత్రంతో అల్లరి నరేష్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.