
పద్మారావునగర్, వెలుగు:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉత్సవాల్లో రెండో రోజు సోమవారం రంగం (భవిష్యవాణి), అంబారీ సేవ ఘనంగా జరిగింది. కర్నాటక నుంచి తెచ్చిన ఏనుగు లక్ష్మిపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి, మేళతాళాలు, పోతరాజుల నృత్యాలు, ఏపీ తాడేపల్లిగూడెం కళాకారుల ప్రదర్శనలతో ఆలయం చుట్టూ ఊరేగింంచారు. వేలాది మంది భక్తులు జగజ్జననికి జేజేలు పలికి ప్రణమిల్లారు.
డీజేలకు అనుమతి లేకున్నా తగ్గేదేలే..
సికింద్రాబాద్లోని వివిధ అమ్మవారి ఆలయాల నుంచి సాయంత్రం బయలుదేరిన ఫలహార బండ్ల ఊరేగింపులు దుమ్మురేపాయి. డీజేలకు అనుమతి లేకపోవడంతో ఇతర వాయిద్యాలను ఉపయోగించారు. బాజా భజంత్రీలు, బోనాల పాటలు, వివిధ వేషధారణలు, యువకుల తీన్మార్ డ్యాన్స్, పోతరాజుల విన్యాసాలతో లష్కర్ ప్రాంతం సందడిగా మారింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఊరేగింపుల్లో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు.