
మెదక్, పాపన్నపేట, గజ్వేల్, వెలుగు: ఎంతో నమ్మకంతో కోర్టులకు వచ్చే కక్షిదారులకు వేగంగా పరిష్కారం చూపినప్పుడే న్యాయ వ్యవస్థపై వారికి విశ్వాసం పెరుగుతుందని హై కోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. ఏండ్ల తరబడిగా కేసులు పెండింగ్ లో ఉండడం సరికాదన్నారు. శనివారం మెదక్ పట్టణంలో జిల్లా కోర్టు బిల్డింగ్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయవాదులు చొరవ తీసుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థకు బార్ అసోసియేషన్ , బెంచ్ రెండు చక్రాల్లాంటివన్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టులకు అవసరాలకు అనుగుణంగా బిల్డింగులు, ఇత మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు నవీన్ రావ్, సంతోష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద, ఆయా కోర్టుల న్యాయమూర్తులు జితేందర్‌రెడ్డి, రీటా లాల్ చంద్, కల్పన, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మెదక్ బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ జెన్నారెడ్డి, సీనియర్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. అనంతరం మెదక్ కెథడ్రల్ చర్చ్, ఏడుపాయల వనదుర్గా భవాని మాత దేవాలయాన్ని సందర్శించారు. అలాగే గజ్వేల్ కోర్టు బిల్డింగ్ నిర్మాణానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు కోర్టు సముదాయాలు తప్పనిసరని, బార్ కౌన్సిల్, బెంచ్‌ల మధ్య పరస్పర సహకారం ఉండాలని ఆకాంక్షించారు.