
న్యూఢిల్లీ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ ) రాబోయే రెండు సంవత్సరాలలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ఇష్యూ ద్వారా రూ.2 వేల కోట్ల మూలధనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను బ్యాంక్ వృద్ధి ప్రణాళికల కోసం వినియోగించనుంది. ప్రస్తుతం ఉన్న 752 శాఖల సంఖ్యను 1,150కి పెంచాలని బ్యాంక్ యోచిస్తోంది. రాబోయే ఐదేళ్లలో రుణాలను మూడు రెట్లు పెంచి, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.లక్ష కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2025 ఆర్థిక సంవత్సరంలో రుణాల విలువ రూ.32,122 కోట్లుగా ఉంది. డిపాజిట్లను కూడా మూడు రెట్లు పెంచి రూ.1.2 లక్షల కోట్లకు చేర్చాలని బ్యాంక్ భావిస్తోంది. బ్యాంక్ గ్యారంటీలు, ఫారెక్స్, కో–-బ్రాండింగ్ కార్డులు వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ చూస్తోంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారడానికి ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ చేసుకున్న దరఖాస్తు ఆర్‌బీఐ వద్ద పెండింగ్‌లో ఉంది. 2025 చివరి నాటికి ఈ విషయంలో ఒక తుది నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు.