Chagos Deal: మారిషస్‌కి చాగోస్ దీవులు.. సార్వభౌమత్వం వదులుకున్న బ్రిటన్

Chagos Deal: మారిషస్‌కి చాగోస్ దీవులు.. సార్వభౌమత్వం వదులుకున్న బ్రిటన్

Chagos Island: దాదాపు రెండు దశాబ్ధాలుగా బ్రిటన్ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని చాగోస్ దీవులపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం నాడు దీవులపై తన సార్వభౌమత్వాన్ని వదులుకుంటున్నట్లు యూకే కీలక ప్రకటన చేసింది. దీంతో దీవులు ప్రస్తుతం మారిషస్ కి బదిలీ చేయబడ్డాయని  బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ స్పష్టం చేశారు.

చాగోస్ ద్వీపసమూహంలోని అతిపెద్దదైన డియెగో గార్సియాలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన అమెరికా-యూకే వైమానిక స్థావరాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా బ్రిటన్ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి ఏటా 136 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.వెయ్యి 156 కోట్లను లీజుగా చెల్లించనున్నట్లు తెలిపింది.

వాస్తవానికి అమెరికా దళాల ఆధీనంలో నిర్వహించబడుతున్న దీవుల్లోని రక్షణ స్థావరం భవిష్యత్తులో బ్రిటన్‌-అమెరికా భద్రత, నిఘా కార్యకలాపాలకు చాలా కీలకమైనది కావటంతో 99 ఏళ్ల పాటు లీజు ఒప్పందం కుదుర్చుకుంది బ్రిటన్. ఇక్కడ నేవీ, బంబార్ స్థావరాలను ఆ దేశం కలిగి ఉంది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో ఉగ్రవాదులను ఓడించడానికి విమానాలను మోహరించడం నుంచి ఎర్ర సముద్రం, ఇండో-పసిఫిక్‌లో ముప్పులను ఊహించడం వరకు ఈ స్థావరం వ్యూహాత్మకంగా ఈ స్థావరం చాలా కీలకమైనదిగా ఉన్నందున లీజు చాలా కీలకమైన వ్యవహారం.

తాజాగా బ్రిటన్ చేసిన ప్రకటనను భారత్ కూడా స్వాగతించింది. పైగా అలాగే హిందూ మహాసముద్రంలో శాంతిని కొనసాగించటానికి తాము మారిషస్ వంటి దేశాలతో కలిపి పనిచేస్తామని భారత్ వెల్లడించింది. తాజా చర్యలు తర్వాతి శతాబ్ధ కాలం పాటు తాము కలిగి ఉన్న సైనిక స్థావరం యూకేకి రక్షణను అందిస్తుందని బ్రిటన్ అభిప్రాయపడింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా తాజా ఒప్పందాన్ని స్వాగతించారు. బ్రిటన్ కుదుర్చుకున్న లీజు డీల్ డియెగో గార్సియాలోని అమెరికా-యుకె ఉమ్మడి సైనిక కేంద్ర దీర్ఘకాలిక, స్థిరమైన, ప్రభావవంతమైన కార్యకలాపాలకు హామీ ఇస్తుందన్నారు.