భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం

భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు రిషి సునక్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునక్,  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కలుసుకున్న కాసేపటికే ఈ ప్రకటన రావడం విశేషం.  గతేడాది అంగీకరించిన యూకే,ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతదేశం అని బ్రిటన్ ప్రభుత్వం  తెలిపింది. 

యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్  కింద 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల విద్యావంతులైన భారతీయ పౌరులు యూకేకి వచ్చి రెండేళ్ల పాటు ఉండటానికి 3 వేల వీసాలను అందిస్తున్నట్లుగా యూకే ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఇండో, పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్‌తో ఎక్కువ సంబంధాలు కలిగి ఉందని పేర్కొంది. యూకేలోని అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారత్ కు చెందినవారే ఉన్నారు. భారత సంతతికి చెందిన రిషి సునక్ ఇటీవలే బ్రిటిన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రిషి సునక్ ప్రధాని అయ్యాక ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి.