అమాయకులను చంపుతున్న రష్యన్లను వదిలిపెట్టం

అమాయకులను చంపుతున్న రష్యన్లను వదిలిపెట్టం
  •     అమాయకులను చంపుతున్న రష్యన్లను శిక్షిస్తం: జెలెన్‌‌స్కీ
  •     సమాధి తప్ప ప్రశాంతమైన ప్రదేశం ఏదీ ఉండదు
  •     రష్యన్లు రక్తపాతం మాత్రమే చేయగలరంటూ ఫైర్


కీవ్: అమాయకులను చంపుతున్న రష్యన్లను తాము ఎన్నటికీ మరిచిపోబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌‌స్కీ అన్నారు. రష్యన్ల కోసం ‘జడ్జిమెంట్‌‌ డే’ వస్తున్నదని, దేవుడు వారిని క్షమించడని హెచ్చరించారు. ‘ఫర్‌‌‌‌గివ్‌‌నెస్ సండే’ సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇర్పిన్ సిటీ నుంచి వెళ్లిపోతున్న 8 మంది పౌరులపై రష్యన్ దళాలు షెల్లింగ్ చేయడంతో నలుగురు సభ్యుల ఫ్యామిలీ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇవి హత్యలు.. ఉద్దేశపూర్వక హత్యలు. యుద్ధం పేరుతో అరాచకాలు చేస్తూ పిల్లలు, మహిళలు సహా వందలాది మందిని చంపుతున్న వారిని శిక్షించి తీరుతం. ఎవ్వరినీ మరిచిపోం. క్షమించబోం. ఈ భూమిపై సమాధి తప్ప ప్రశాంతమైన ప్రదేశం ఏదీ ఉండదు’’ అని అన్నారు. మానవతా కారిడార్లకు బదులుగా.. వాళ్లు రక్తపాతం మాత్రమే చేయగలరని జెలెన్‌‌స్కీ మండిపడ్డారు. 

రష్యన్లవి జబ్బుపడిన మెదళ్లు: ఉక్రెయిన్

సోమవారం కాల్పుల విరమణ ప్రతిపాదనను ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్‌‌చుక్ తిరస్కరించారు. తమపై దాడి చేస్తున్న దేశంలోకి వెళ్లబోమని స్పష్టం చేశారు. ‘‘ఇది మానవతా మార్గాలను తెరిచే పద్ధతి కాదు. మా ప్రజలు కీవ్ నుంచి బెలారస్‌‌కి, విమానంలో రష్యాకు వెళ్లరు’’ అని అన్నారు. ‘‘అసలు గ్రీన్ కారిడార్లే ఉండవు. ఎందుకంటే రష్యన్ల జబ్బుపడిన మెదడు.. ఎప్పుడు, ఎవరిమీద కాల్పులు జరపాలనేది మాత్రమే నిర్ణయిస్తుంది” అని ఇంటీరియర్ మినిస్ట్రీ అడ్వైజర్ ఆండోన్ మండిపడ్డారు.