రష్యా ఆయిల్ టెర్మినల్పై ఉక్రెయిన్ దాడి

రష్యా ఆయిల్  టెర్మినల్పై ఉక్రెయిన్ దాడి

కీవ్/ మాస్కో: రష్యాకు చెందిన అతిపెద్ద ఆయిల్  టెర్మినల్​పై ఉక్రెయిన్  డ్రోన్  దాడి చేసింది. రష్యాలో వాయవ్య ప్రాంతంలోని ప్రిమోర్స్​క్​లో ఈ దాడి జరిగింది. దీంతో రెండు నౌకలకు నిప్పంటుకుంది. అలాగే, ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలకూ అంతరాయం కలిగింది. తాము చేసిన డ్రోన్  అటాక్ లో కుస్తో, కాయ్  యున్  అనే ఆయిల్  ట్యాంకర్లు ధ్వంసం అయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 

అయితే.. ఉక్రెయిన్ డ్రోన్  దాడిలో రెండు నౌకలకు నిప్పు అంటుకోలేదని, ఒక నౌకకు మాత్రమే నిప్పంటిందని రష్యా అధికారులు తెలిపారు. కాగా.. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్​పై రష్యా భీకరంగా దాడులు చేసింది. చివరిసారిగా 800 డ్రోన్లు ప్రయోగించింది. రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతికోసం చర్చలు జరుగుతుండగానే రష్యా ఈ దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ కూడా ప్రతిదాడులను తీవ్రం చేసింది. ముఖ్యంగా రష్యా ఆయిల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది.

ఉక్రెయిన్​తో చర్చలు ఆగినయ్: రష్యా 

ఉక్రెయిన్​తో శాంతి చర్చలు ఆగిపోయాయని రష్యా ప్రకటించింది. చర్చల ప్రక్రియకు యూరోపియన్ యూనియన్ దేశాలే అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించింది. రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈమేరకు శుక్రవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు రష్యా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని ఆయన చెప్పారు.