ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దంలో ఓ జర్నలిస్ట్ బలయ్యాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్ పట్టణంలో జరిగిన కాల్పుల్లో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ మేకర్ బ్రెంట్ రెనాడ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడింది రష్యన్ బలగాలేనని ఉక్రెయిన్ నేతలు, అధికారులు ఆరోపిస్తున్నారు. ఇర్పిన్ లో రష్యా చేసిన కాల్పుల్లో  బ్రెంట్ రెనాడ్ అక్కడికక్కడే మరణించాడని, మరో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఉక్రెయిన్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారని ఏఎఫ్పీ వార్తా సంస్థ పేర్కొంది. దాడిలో మరణించిన బ్రెంట్ వద్ద కొన్ని పేపర్లు, అమెరికాకు చెందిన మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఐడీ కార్డు దొరికినట్లు తెలిపింది. అలాగే జర్నలిస్ట్ బ్రెంట్ ను చంపింది రష్యన్ బలగాలే అంటూ ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సొవ్సన్ ట్వీట్ చేశారు. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రెగ్నెంట్ మహిళలు, చిన్నపిల్లలు, సామాన్య పౌరులపై సైతం రష్యన్ సైనికులు కాల్పులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది యావత్ పౌర సమాజంపై జరుగుతున్న యుద్ధమని అన్నారు.

ఉక్రెయిన్ కు మేం పంపలే: న్యూయార్క్ టైమ్స్

జర్నలిస్ట్ బ్రెంట్ మృతిపై న్యూయార్క్ టైమ్ సంతాపం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం ఆయనను ఉక్రెయిన్ కు తాము ఎటువంటి అసైన్ మెంట్ పైనా పంపలేదని స్పష్టం చేసింది. బ్రెంట్ చాలా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అని, ఆయన గతంలో తమకు పలు స్టోరీలకు పని చేశారని, అయితే ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్ కోసం పని చేయడం లేదని తెలిపింది. ఆయన వద్ద తమ సంస్థ ఐడీ కార్డు ఉండడంతో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ అంటూ వార్తలు వచ్చాయని, 2015 తర్వాత తమకు వర్క్ చేయలేదని వివరిస్తూ టైమ్స్ ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..?

ఉక్రెయిన్లో మరో మేయర్ కిడ్నాప్

సింగరేణి ప్రైవేటీకరణపై ఎక్కడైనా చర్చకు రెడీ