సింగరేణి ప్రైవేటీకరణపై ఎక్కడైనా చర్చకు రెడీ

సింగరేణి ప్రైవేటీకరణపై ఎక్కడైనా చర్చకు రెడీ
  • ప్రైవేటు ఇచ్చేయాలని చేస్తున్నది కేసీఆర్ సర్కారే
  • ఉల్టా కేంద్రంపైనే దుర్మార్గపు ప్రచారం: ఈటల

పెద్దపల్లి: సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ విషయంపై అసెంబ్లీలోనైనా, ఇంకెక్కడైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం 27వ ద్వైవార్షిక మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని, సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నదని కేసీఆర్ దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం దగ్గరలోనే ఉందని ఈటల హెచ్చరించారు. సింగరేణిని ప్రపంచంలోనే గొప్ప సంస్థగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పిన కేసీఆర్.. మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. చైతన్యానికి మారు పేరుగా ఉన్న కార్మిక సంఘాలు సమ్మె చేస్తే ఆ చైతన్యాన్ని చంపేసిన మొట్టమొదటి సీఎం కేసీఆరే అని అన్నారు. సింగరేణిలో చైతన్యం మునుపటి లెక్క లేదని, సంఘటితంగా సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితులు పోయాయని అన్నారు. సింగరేణి, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యతను కేసీఆర్ దెబ్బ తీశారని ఈటల అన్నారు. 

కేసీఆర్ ప్రైవేటు పరం చేయాలని చూస్తుండు

బొగ్గును ఉత్పత్తి చేసి ఈ దేశానికి వెలుగును అందిస్తున్న సింగరేణి సంస్థకు సీఎం కేసీఆర్ ఇష్టానికి సొంత నిబంధనలు పెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తారని గుర్తు చేశారు. కానీ, మొత్తం గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారానికి తెరలేపారని చెప్పారు. ఈ అంశంపై ఎక్కడైనా తాను చర్చకు వచ్చేందుకు సిద్ధమేనని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి, నిజాయతీ లేవని, కార్మికుల కుటుంబాలపై ప్రేమ లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజానీకాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్

ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలె

కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగమే