స్టీల్ ప్లాంట్ లో దాక్కుని పోరాడుతున్న ఉక్రెయిన్ సోల్జర్లు

స్టీల్ ప్లాంట్ లో దాక్కుని పోరాడుతున్న ఉక్రెయిన్ సోల్జర్లు
  •     లొంగిపోవాలని రష్యా హెచ్చరిక.. ఆ ప్రసక్తేలేదన్న ఉక్రెయిన్   
  •     స్టీల్ ప్లాంట్ తప్ప సిటీ అంతా రష్యన్ల చేతిలోకి   
  •     తమ సోల్జర్లను చంపితే ఇక చర్చలుండవన్న జెలెన్ స్కీ  


కీవ్/మాస్కో: ఉక్రెయిన్​లోని మరియుపోల్ సిటీలో యుద్ధం ఆఖరి దశకు చేరింది. ఒక్క అజోవ్ స్టాల్ స్టీల్ ప్లాంట్ తప్ప మిగతా సిటీ అంతటినీ రష్యన్ సోల్జర్లు దాదాపుగా తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ పట్టణం అంత ఉన్న స్టీల్ ప్లాంటులో బాంబులను సైతం తట్టుకుని నిలబడే అండర్ గ్రౌండ్ టన్నెల్స్, బిల్డింగులు ఉండటంతో వాటిలో దాక్కుని ఉక్రెయిన్ సోల్జర్లు పోరాటం కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో సుమారు 3 వేల మంది సైనికులు ఉన్నారని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. మరియుపోల్ అంతా తమ స్వాధీనంలోకి వచ్చిందని, ఉక్రెయిన్ సోల్జర్లు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామంటూ రష్యా ఆదివారం ఉదయం ప్రకటించింది. కానీ రష్యన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చిచెప్పింది. దీంతో స్టీల్ ప్లాంట్ లోని ఉక్రెయిన్ సోల్జర్లు మందుగుండు అయిపోయే వరకు మాత్రమే రష్యన్లను ప్రతిఘటించే అవకాశం ఉందని చెప్తున్నారు. 

రష్యాకు కీలకం 

ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని క్రీమియాను రష్యా గతంలోనే స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తూర్పున ఉన్న డాన్​బాస్ ఏరియాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. అయితే, క్రీమియా నుంచి భూమార్గంలో డాన్​బాస్​ను ఆక్రమించుకోవాలంటే ఈ రెండింటి మధ్య అజోవ్ సముద్ర తీరంలో ఉన్న మరియుపోల్ సిటీని సొంతం చేసుకుని కారిడార్​ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మొదటి నుంచీ మరియుపోల్​ను పూర్తిగా ధ్వంసం చేయడంపైనే రష్యా దృష్టిపెట్టింది. యుద్ధానికి ముందు సిటీలో 4.50 లక్షల మంది జనాభా ఉండగా, ప్రస్తుతం 1.20 లక్షల మంది కూడా లేరని అంచనా. ఈ ఒక్క సిటీలోనే సుమారు 20 వేల మంది ప్రజలను రష్యన్లు హతమార్చారని, వేలాది మందిని తమ దేశానికి తరలించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. తూర్పున ఉన్న డాన్​బాస్ ఏరియాపై డైరెక్ట్​గా ఫోకస్ పెట్టిన రష్యా.. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని సిటీలపై మాత్రం లాంగ్ రేంజ్ మిసైల్స్​తో దాడులు కొనసాగిస్తోంది. కీవ్, లవీవ్, ఖార్కివ్ సిటీలపైనా రష్యా దాడులు కొనసాగించింది.  

స్పెయిన్ గ్రామానికి ఉక్రెయిన్ పేరు 

ఉక్రెయిన్ కు సంఘీభావం తెలుపుతూ స్పెయిన్ లోని ఓ పట్టణ ప్రజలు తమ గ్రామం పేరునే మార్చుకున్నారు. ఫ్యూంటెస్ డీ ఆండలూసియా అనే ఆ ఊరి పేరును ఉక్రేనియాగా మార్చుకుని ఊరిలోని గోడలపై అదే పేరు రాసుకున్నారు. పేరు పక్కన ఉక్రెయిన్ జెండా రంగులను కూడా పెయింట్ చేశారు. అలాగే ఒక్కో వీధికి ఒక్కో ఉక్రెయిన్ సిటీ పేరును పెట్టుకున్నారు. కీవ్, ఒడెస్సా, మరియుపోల్ పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ కు 4 వేల కిలోమీటర్ల దూరంలో, ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్ లో జరుగుతున్న దారుణాలను ప్రపంచ దేశాల దృష్టికి తేవడం కోసమే ఇలా పేర్లు మార్చుకుంటున్నామని ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు. అలాగే ఉక్రెయిన్ నుంచి వచ్చే 25 మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఓ రెఫ్యూటీ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులంతా కలిసి 3,780 డాలర్లు (సుమారు రూ. 3 లక్షలు) పోగేసుకున్నారు.

మరియుపోల్​లో అందర్నీ చంపాలని చూస్తోంది..

మరియుపోల్​లో అమానవీయ పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడున్న ప్రతి ఒక్కరినీ అంతం చేయాలని రష్యా చూస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు. సిటీలో ఉన్న తమ సోల్జర్లందరినీ చంపితే గనక.. ఇకపై రష్యాతో శాంతి చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాలు మరిన్ని భారీ ఆయుధాలు, యుద్ధవిమానాలను వెంటనే అందజేస్తే తప్ప మరియుపోల్​ను కాపాడుకోలేమన్నారు. 

పుతిన్​తో చర్చలు టైంవేస్ట్: ఇటలీ ప్రధాని మారియో 

ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్​తో చర్చలు జరపడం టైం వేస్ట్ వ్యవహారమేనని ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి అన్నారు. యుద్ధం ఆపేందుకు పశ్చిమ దేశాలు ఇప్పటికే చేసిన అన్ని దౌత్య ప్రయత్నాలూ విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఉక్రెయిన్ ను సర్వనాశనం చేసి, స్వాధీనం చేసుకుని, తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కొలువుదీర్చాలన్నదే పుతిన్ లక్ష్యమన్నారు. శాంతిని నెలకొల్పడం కోసం పుతిన్ ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదని డ్రాఘి ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అయితే, రష్యా ఆక్రమణను ఉక్రెయిన్ ప్రజలు అంగీకరించే పరిస్థితి ఎంత మాత్రం లేదన్నారు.