రష్యా చెప్పినట్లే తరలించాలంటే ఎట్లా?

రష్యా చెప్పినట్లే తరలించాలంటే ఎట్లా?

కీవ్/మాస్కో: ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్కివ్, మరియుపోల్, సుమీ నగరాల నుంచి ప్రజలను తరలించేందుకు ఆరు మానవతా కారిడార్​లను ఏర్పాటు చేద్దామంటూ సోమవారం రష్యా చేసిన ప్రతిపాదనలను ఉక్రెయిన్ తిరస్కరించింది. రష్యా, దాని మిత్రదేశం బెలారస్​కు మాత్రమే ప్రజలను తరలించాలంటూ ప్రతిపాదించడం ఏమిటని మండిపడింది. రష్యా ప్రతిపాదన అనైతికమని ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం ఇరినా వెరెష్చుక్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలను సిటీల నుంచి దేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఒప్పుకోవాలని, అంతే తప్ప రష్యాకు, బెలారస్ కు మాత్రమే తరలించాలని చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్ చేసిన విజ్ఞప్తి మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి కారిడార్ లను ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా రక్షణ శాఖ ప్రకటన చేసింది. కీవ్ నుంచి బెలారస్ కు, తూర్పున ఉన్న ఇతర మూడు సిటీల నుంచి రష్యాకు ప్రజలను తరలించేందుకు రూట్ మ్యాప్​లు గుర్తించినట్లు వెల్లడించింది. అయితే, రష్యా ప్రకటనను జెలెన్ స్కీ అధికార ప్రతినిధి ఖండించారు. ‘‘వాళ్లు ఉక్రెయిన్ ప్రజలు. ఉక్రెయిన్ లోనే ఇతర ప్రాంతాలకు వెళ్లే హక్కు వాళ్లకుంది. కానీ ప్రజల తరలింపు తాము చెప్పినట్లే జరగాలని రష్యా కోరుకుంటోంది” అని తప్పుపట్టారు.

కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా 

ఉక్రెయిన్​లోని కీవ్, ఖార్కివ్, మరియుపోల్, సుమీ సిటీల నుంచి ప్రజలను తరలించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి కారిడార్ లు ఓపెన్ చేయడంతో పాటు కాల్పుల విరమణ కూడా పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా.. మరోవైపు బాంబు దాడులను కొనసాగిస్తోందని ఉక్రెయిన్ మండిపడింది.