వేలాది మంది చనిపోయారు.. ఎక్కడికక్కడే శవాలు.. అంత్యక్రియలు చేసే దిక్కులేదు.. రోజులు గడిచే కొద్దీ మృతదేహాలన్నీ కుళ్లిపోయాయి.. ఊపిరాడనంత దుర్వాసన వస్తున్నది. దీనికితోడు మురుగు నీరంతా తాగునీటితో కలిసిపోయింది. రష్యా దురాక్రమణతో విధ్వంసమైన ఉక్రెయిన్‌లోని మరియుపోల్ పరిస్థితి ఇది. ఈ పోర్ట్ సిటీని ఇప్పుడు కలరా వ్యాధి భయపెడుతున్నది. దీంతో రష్యా అధికారులు ముందుజాగ్రత్తగా సిటీలో లాక్డౌన్ విధించారు. మరోవైపు రష్యాతో 100 రోజులుగా ఉక్రెయిన్ పోరాడుతూనే ఉన్నది. తాజాగా రష్యాకు చెందిన 50వ కర్నల్ చనిపోయాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 31 వేల మంది రష్యన్లు చనిపోయారు. ఇందులో 12 మంది జనరల్స్ కూడా ఉన్నారు.
మరియుపోల్, కీవ్, మాస్కో: ఉక్రెయిన్ పోర్టు సిటీ మరియుపోల్‌కు కలరా టెన్షన్పట్టుకుంది. రష్యా ఆధీనంలో ఉన్న ఈ పోర్ట్సిటీలోని తాగునీరంతా కలుషితమైంది. యుద్ధంలో చనిపోయిన వారి బాడీలను తగులబెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అక్కడి అధికారులు వాటిని అలాగే వదిలేశారు. మృతదేహాలన్నీ కుళ్లిపోయాయి. దీనికితోడు మురుగునీరంతా తాగునీటితో కలిసిపోయింది. ఫలితంగా మరియుపోల్‌పై కలరా ఎటాక్ చేసే చాన్స్ఉంది. అప్రమత్తమైన రష్యా అధికారులు.. నగరంలో లాక్డౌన్ విధించి, ప్రజలను ఇండ్లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. కలరాకు తోడు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశాల్లేకపోలేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలను క్వారంటైన్లో ఉంచాలనే చర్చ జరుగుతోందని మరియుపోల్ అడ్వైజర్ పెట్రో ఆండ్రియోష్చెంకో తెలిపారు. సిటీ అంతా దుర్వాసన వస్తోందని, ఇప్పటికీ మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయని, పూడ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదన్నారు.
లుహాన్స్క్లో 97% మా కంట్రోల్లోనే: రష్యా
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని లుహాన్స్క్ రీజియన్‌లో 97% భూభాగానికి విముక్తి కల్పించామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు. సీవీరోడోనెట్స్క్లోని నివాస సముదాయాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పొపాసనా పట్టణం వైపు రష్యా బలగాలు కదులుతున్నాయని, లైమన్, స్వితోహ్రిస్క్ సహా మరో 15 టౌన్లను కంట్రోల్లోకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు డోనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లలోని మిగతా ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
