రష్యా మిసైల్ దాడితో కమ్యూనికేషన్ లైన్ షట్ డౌన్

రష్యా మిసైల్ దాడితో కమ్యూనికేషన్ లైన్ షట్ డౌన్
  • బ్యాకప్ డీజిల్ జనరేటర్లతో ప్లాంట్ నిర్వహణ

కీవ్: ఉక్రెయిన్ లోని జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ కు కరెంట్ సరఫరా బందయింది. ఐదు రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ అన్నారు. ప్రస్తుతం ఆ ప్లాంట్ రష్యా బలగాల ఆధీనంలో ఉందన్నారు. ప్లాంట్ కు కరెంట్ సరఫరా బంద్ కావడం ఆందోళన కలిగించే విషయమని ఆయన ట్వీట్​ చేశారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ను గ్రోసీ మంగళవారం కలిశారు. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ ను మానిటర్ చేస్తున్నామని, బ్యాకప్ డీజిల్ జనరేటర్లతో ప్లాంట్ పనిచేసేలా చూస్తున్నామని ఆయన తెలిపారు. ఎప్పటికపుడు ప్లాంట్ భద్రతను గమనిస్తున్నామని గ్రోసీ పేర్కొన్నారు.

రష్యా మిసైల్​ దాడిలో న్యూక్లియర్ ప్లాంట్ కు దగ్గరలో ఉన్న సబ్​స్టేషన్​ ధ్వంసమైందని, దీంతో కీలక కమ్యూనికేషన్ లైన్ షట్ డౌన్ అయిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. డీజిల్ జనరేటర్లు ఆటోమేటిక్ గా ఆన్ అయ్యాయని చెప్పారు. ఇక రష్యా బలగాల అధీనంలో ఉన్న సౌత్ ఖేర్సన్ ప్రాంతంలోని ఐదు సెటిల్ మెంట్లను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ మిలటరీ అధికారులు తెలిపారు. మరోవైపు కెర్చ్ బ్రిడ్జిపై బాంబు దాడికి పాల్పడిన ఆరోపణలపై ఎనిమిది మందిని అరెస్టు చేశామని రష్యా సెక్యూరిటీ ఏజెన్సీ ఎఫ్ఎస్ బీ వెల్లడించింది. ఉక్రెయిన్ మిలటరీ ఆదేశాలతోనే నిందితులు బ్రిడ్జిపై బాంబు దాడి చేశారని ఎఫ్ఎస్ బీ ఆరోపించింది. బ్రిడ్జిపై జరిగిన బాంబు దాడిని టెర్రరిస్టు చర్య అని, ఉక్రెయిన్ బలగాలే ఆ దాడికి మాస్టర్ మైండ్  అని  పుతిన్ ఆరోపించారు.