
- నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్
- రాష్ట్రంలో 12.45 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని టార్గెట్
- ఇప్పటికే 10 లక్షల మందికిపైగా అర్హుల గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉల్లాస్’కార్యక్రమాన్ని ఈ ఏడాది రాష్ట్రంలో అమలు చేయనున్నారు. దేశంలో 15 ఏండ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంతో అండర్ స్టాండింగ్ అఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) స్కీమ్‌ను 2022లో తీసుకొచ్చింది. 2022–- 2027 వరకు దీనిని అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో ఈ కార్యక్రమం ద్వారా 12.45 లక్షల మందికి చదువు చెప్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు మొదటి వారంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.
గతేడాదే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 2024– 25 విద్యా సంవత్సరంలో 4.15 లక్షల మందిని, 2025–26లో 8.30 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, గతేడాది ఈ స్కీమ్ ప్రారంభించాల్సి ఉన్నా.. అడల్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది లేక ప్రారంభంకాలేదు. దీనిని గమనించిన విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. టార్గెట్ రీచ్ అయ్యేందుకు అధికారులతో ప్రత్యేకంగా పలుమార్లు సమావేశమయ్యారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా మహిళా సంఘాల సహకారంతో నిరక్షరాస్యులను గుర్తిస్తున్నారు.
10.30 లక్షల మంది గుర్తింపు..
ఉల్లాస్ స్కీమ్ కింద 12.45 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర సర్కార్, ఇప్పటికే 10.30 లక్షల మందికి పైగా అర్హులను గుర్తించింది. నారాయణపేట, వనపర్తి, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ, నల్గొండ, సిద్దిపేట, కొత్తగూడెం తదితర జిల్లాల్లో లక్ష్యాన్ని మించి నిరక్షరాస్యులను గుర్తించారు. అయితే, మేడ్చల్, గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో టార్గెట్‌లో సగం కూడా చేరలేదు.
గుర్తించిన వారందరికీ చదవడం, రాయడం, అంకెలు గుర్తించడంతో పాటు చిన్నచిన్న లెక్కలు చేయడాన్ని నేర్పించనున్నారు. అర్హులను మొదట ఉల్లాస్ యాప్‌లో రిజిస్టర్ చేయించాల్సి ఉండగా, ఇప్పటికే 5 లక్షల మందికి పైగా వివరాలను అప్ లోడ్ చేశారు. ప్రతి పది మందికి ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. మహిళా సంఘాలు, టాస్ ద్వారా వీరిని గుర్తిస్తున్నారు. సుమారు 1.20 లక్షల మంది విద్యా వలంటీర్లు అవసరం కాగా.. ఇప్పటికీ 70 వేల మందిని గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రతి గ్రామంలో జీపీలు, స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాలు, లైబ్రరీలు, కమ్యూనిటీ భవనాలు, సామాజిక చైతన్య కేంద్రాలు తదితర వాటిలో ‘ఉల్లాస్’క్లాసులు నిర్వహించనున్నారు.
వచ్చే నెలలో ప్రారంభానికి చర్యలు..
వచ్చే నెల మొదట్లో ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. మిగిలిపోయిన నిరక్షరాస్యులను, విద్యా వాలంటీర్లను ఈ నెలాఖరు నాటికి గుర్తించి, రిజిస్టర్ చేయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యా వలంటీర్లకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్ పూర్తి చేయనున్నారు. మరోవైపు, నిరక్షరాస్యుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలనూ తయారు చేయిస్తున్నారు. ప్రస్తుతం అక్షర వికాసం(వాచకం), మార్గదర్శిని, వర్క్ షీట్లు, క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ ఎస్‌సీఈఆర్టీ సహకారంతో రూపొందించారు. ఇవి ప్రింటింగ్ దశలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.