
వెలుగు: గుర్తింపులేని 340 స్కూళ్లకు.. పాఠశాల విద్యాశాఖ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. వాటిలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు ఓకే చెప్పింది. స్టూడెంట్లు ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది .
15 వేల మందికి ఊరట
రాష్ర్టంలో అధికారికంగా గుర్తింపు పొందని హైస్కూల్స్ 340 వరకు ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలో కొత్తగా ఈ విద్యాసంవత్సరం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న స్కూళ్లు 88 ఉండగా, మరో 252 బడులకు ఫైర్ సెఫ్టీతోపాటు వివిధ అనుమతులు లేకపోవడంతో గుర్తింపు లభించలేదు. ఈనెల 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు లేని బడుల్లో చదువుతున్న సుమారు 15 వేల మంది స్టూడెంట్ల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ 340 స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు హాల్ టికెట్లు జారీచేసి, పరీక్షలకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది .
ఏటా ఇదే తంతు
రాష్ర్టంలో సుమారు వెయ్యి వరకూ అనుమతి లేని పాఠశాలలు ఉన్నాయని అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదో ఒక సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఆయా స్కూళ్లకు విద్యాశాఖ అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. యాజమాన్యాలు చివరి నిమిషంలో పదో తరగతి విద్యార్థుల పేరు చెప్పి, తాత్కాలికంగా అనుమతి తీసుకుని ఆ ఏడాది గట్టెక్కెస్తున్నాయి. ఏటా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి శాశ్వత ముగింపు పలికేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.