
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ముగ్గురు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్, గుప్తాలను పార్టీ రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో ఢిల్లీ మహిళా కమిషన్ ( డీసీడబ్ల్యూ) మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను ఆప్ నామినేట్ చేసింది.
ఈ నెల 19న ఎన్నికలు జరగాల్సి ఉన్నా..ముగ్గురు ఆప్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల ఫలితాలను ముందే ప్రకటించామని రిటర్నింగ్ అధికారి ఆశిష్ కుంద్రా వెల్లడించారు. వీరికి గెలుపు పత్రాలను అందజేసినట్లు చెప్పారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడంపై సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, స్వాతి మలివాల్ లకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. పార్లమెంటులో సామాన్యుల సమస్యలను లేవనెత్తుతారని నమ్ముతున్నట్లు చెప్పారు.