తెలంగాణ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్డ్ డబ్బు రూ. 2 వేల 200 కోట్లు

తెలంగాణ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్డ్ డబ్బు రూ. 2 వేల 200 కోట్లు
  • 80 లక్షల ఖాతాల్లో నిధుల గుర్తింపు
  • ఎస్బీఐలోనే అత్యధికం.. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా అన్ క్లెయిమ్డ్​ సొమ్ము
  • డిసెంబర్ 31లోగా క్లెయిమ్ చేసుకోకపోతే ‘డీఈఏఎఫ్‌‌‌‌’కు బదిలీ

హైదరాబాద్, వెలుగు:  కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ, దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడమో.. వెరసి రాష్ట్రంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల సొమ్ము దిక్కులేనిదై మూలుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో దాదాపు పదేండ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌‌ఎల్‌‌బీసీ) ఆర్‌‌బీఐకి తాజా గా నివేదించింది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.2,200 కోట్లు క్లెయిమ్ చేయని సొమ్ముగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది తమ ఆర్థిక లావాదేవీలను గోప్యంగా ఉంచడం, నామినీ వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజధాని మహానగరం పరిధిలోనే అత్యధికంగా అన్‌‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండటం గమనార్హం. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా రూ.850 కోట్లు బ్యాంకుల్లో మగ్గుతుండగా, ఆ తర్వాతి స్థానంలో రూ.300 కోట్లతో రంగారెడ్డి జిల్లా నిలిచింది. 

జిల్లాల వారీగా పేరుకుపోయిన సొమ్ము ఇలా..

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లోనూ రూ.కోట్లు వారసుల కోసం ఎదురుచూస్తున్నాయి. గణాంకాల ప్రకారం.. వరంగల్ లో రూ.152 కోట్లు, నల్గొండలో రూ.125 కోట్లు, కరీంనగర్​లో రూ.146 కోట్లు అన్‌‌క్లెయిమ్డ్ గా ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో రూ.102 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.101.63 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.106.65 కోట్లు, మహబూబ్‌‌నగర్ జిల్లాలో రూ.118 కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే ఈ మొత్తం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, వలసలు, మల్టీ ఖాతాలను నిర్వహించడం అని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. ఖాతాదారులు తమ చిరునామాలు మార్చినప్పుడు బ్యాంకులో అప్డేట్ చేయకపోవడం కూడా ఇందుకు కారణమే. ఏ బ్యాంకులో ఎంత సొమ్ము ఉందనే వివరాలను పరిశీలిస్తే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌‌బీఐ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క ఎస్బీఐలోనే దాదాపు 21.62 లక్షల ఖాతాల్లో సుమారు రూ.590 కోట్లు క్లెయిమ్ చేయని సొమ్ము ఉన్నట్లు గుర్తించారు. తర్వాత స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఇందులో 20 లక్షల ఖాతాల్లో రూ. 470 కోట్లు పేరుకుపోయాయి. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఇతర జాతీయ బ్యాంకులతో పాటు గ్రామీణ వికాస్ బ్యాంకుల ఖాతాల్లోనూ భారీగా నిధులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేటు బ్యాంకులైన హెచ్‌‌డీఎఫ్‌‌సీ, ఐసీఐసీఐ వంటి వాటిలో కూడా ఈ తరహా ఖాతాలు లక్షల్లో ఉండటం గమనార్హం.

బ్యాంకుల్లో ప్రత్యేక డ్రైవ్​

ఆర్‌‌బీఐ నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు ఖాతాలోనైనా పదేండ్లపాటు లావాదేవీలు జరగకపోతే, ఆ ఖాతాను ‘ఇన్ ఆపరేటివ్’ లేదా ‘అన్‌‌క్లెయిమ్డ్’గా పరిగణిస్తారు. ఇలా పదేండ్లు దాటిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో, ఆ మొత్తాన్ని ‘డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌‌నెస్ ఫండ్’ (డీఈఏఎఫ్) ఖాతాకు బదిలీ చేస్తారు. అయితే, ఈ నిధులపై అవగాహన కల్పించి, అర్హులైన వారికి లేదా వారి వారసులకు సొమ్మును అందజేయడమే లక్ష్యంగా బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్‌‌ చేపట్టాయి. ఆర్‌‌బీఐ ఆదేశాల మేరకు నవంబర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో  ‘వారసుల వేట’పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌‌ నిర్వహిస్తున్నారు.

క్లెయిమ్‌‌ చేయని సొమ్మును తెలుసుకునేందుకు ‘ఉద్గం’ పోర్టల్

ఖాతాదారులు లేదా వారి వారసులు తమకు తెలియకుండా బ్యాంకుల్లో ఉన్న సొమ్మును సులభంగా గుర్తించేందుకు ఆర్‌‌బీఐ ‘ఉద్గం’ అనే ప్రత్యేక పోర్టల్‌‌ అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు ఈ పోర్టల్‌‌లో లాగిన్ అయి, తమ లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లు, పాన్ కార్డు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఏ బ్యాంకులో ఎంత సొమ్ము ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణించి ఉంటే, చట్టబద్ధమైన వారసులు మరణ ధృవీకరణ పత్రం, లీగల్ హెయిర్ సర్టిఫికెట్, కేవైసీ పత్రాలతో సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకుల్లో పేరుకుపోయిన ఈ అనాథ సొమ్మును సొంతం చేసుకునేందుకు డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా బ్యాంకులు నిర్ణయించాయి. ఈలోగా ఖాతాదారులు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని, లేదంటే ఆ సొమ్ము ఆర్‌‌బీఐకి చెందిన డీఈఏఎఫ్‌‌ ఖాతాలోకి వెళ్లిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయితే, డీఈఏఎఫ్‌‌కి వెళ్లిన తర్వాత కూడా క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది.