పెద్దపల్లి : ఓసీపీ కోసం భూములు తీసుకున్న సింగరేణి పదేండ్లు దాటుతున్నా నేటికీ పరిహారం ఇవ్వలేదు. జీవనాధారమైన భూములు పోవడంతో బాధితులు బతుకుదెరువు కరవై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ3 డివిజన్ పరిధిలో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు 2ను విస్తరించడానికి సింగరేణి యాజమాన్యం 2011లో బుధారంపేట గ్రామంలో భూములను సేకరించాలని నిర్ణయించింది. భూసేకరణ కోసం సర్వే నిర్వహించి 200 కుటుంబాలకు చెందిన 708.16 ఎకరాల భూమిని తీసుకున్నారు. గ్రామస్తులతో ఎలాంటి చర్చలు జరుపకుండా భూములు స్వాధీనం చేసుకున్నట్లు అవార్డు పాస్ చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు, ఇతర పరిహారాల కింద రూ.2.75 లక్షలు, మొత్తంగా రూ. 4.30 లక్షలు ఇవ్వడానికి సంస్థ నిర్ణయించి, పరిహారం కింద రూ. 37 కోట్లు స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేసింది. గ్రామస్తులు సింగరేణి నిర్ణయించిన పరిహారానికి ఒప్పుకోలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ భూములతో పాటు గ్రామాన్ని కూడా తీసుకొని గ్రామస్తులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. దానికి సింగరేణి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో 2017లో సింగరేణి ప్రకటించిన పరిహారం అవార్డును రద్దు చేయాలని గ్రామస్తులు హైకోర్టులో కేసు వేశారు. భూములు కోల్పోయిన రైతులు ఉపాధి లేక పేదరికంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న రైతుబంధు, రైతుబీమాకు నోచుకోకుండా పోయారు. గ్రామంలో 9 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. వారికి రైతుబీమా కూడా వర్తించలేదు.
|
ఇండ్లు వదిలేసిన్రు
వ్యవసాయ భూములను సేకరించే టైంలో గ్రామాన్ని సైతం తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం చెప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే భూసేకరణ టైంలో గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేయవద్దని సింగరేణి యాజమాన్యం అన్ని ప్రభుత్వ శాఖలకు సూచించింది. దీంతో ముందస్తుగా గ్రామపంచాయతీకి చెందిన అన్ని రికార్డులను సీజ్ చేశారు. 2017లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర భూసర్వేలో బుదారంపేట గ్రామస్తుల పేరు మీద ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల్లో సింగరేణి పేరు మీదికి మార్చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు, రైతుబీమా లాంటి బెనిఫిట్స్ రైతులకు అందటం లేదు. భూసేకరణపై స్పష్టత రాకపోవడంతో కొంతమంది రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ వారికి పాస్ బుక్కులు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి సేకరించిన భూమికి నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అలాగే గ్రామాన్ని కూడా తీసుకొని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలని, లేదంటే తమ భూములు తమకే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సర్కారు బెనిఫిట్స్ వస్తలేవు
నా ఆరెకరాల భూమి సింగరేణి తీసుకున్నది. పరిహారం ఇయ్యలే. మాభూములన్నీ సింగరేణి పేరుమీదికి పోయినయి. పాస్‌బుక్‌లు లేకపోవడంతో బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. సర్కార్ నుంచి రైతుబంధు, రైతుబీమా వస్తలేవు. సర్కారు మాకు న్యాయం చేయాలే. – కన్నూరి ఓదెలు, బుధారంపేట,
ఏకపక్షంగా సింగరేణి..
సింగరేణి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామస్తులంతా ఇబ్బంది పడుతున్నరు. వెంటనే ప్రభుత్వం కల్పించుకొని గ్రామస్తులకు న్యాయం చేయాలే. సింగరేణి ఇచ్చిన అవార్డును క్యాన్సిల్ చేయాలే. లేదంటే ప్రస్తుత భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలే. సింగరేణి చేసిన పాత ప్రపోజల్‌కు మేం ఒప్పుకోం. – ఆరెల్లి కొమురయ్యగౌడ్, బుధారంపేట, పెద్దపల్లి జిల్లా
