కొత్త కార్మిక చట్టాలు.. దేశంలో పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెరగబోతున్నాయా?

కొత్త కార్మిక చట్టాలు.. దేశంలో పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెరగబోతున్నాయా?

ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇందులోని కొన్ని అంశాలు వారికి అనువైనవిగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా అందరి ఆందోళనల పనివేళలపైనే కొనసాగుతోంది. కొత్త చట్టాల కింద రోజూ పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతారా అనే భయం వెంటాడుతోంది. 

ఇప్పటికే దేశంలో పని గంటల గురించి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి లాంటి వారు వారానికి 70 గంటలు చేయాలని కోరుతున్నారు. ఇది చైనాలో ఉన్న 9-9-6 విధానానికి దాదాపుగా దగ్గరగా ఉంటుందని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరిలో ఉన్న భయం కొత్త లేబర్ చట్టాలు పని వేళలలను రోజుకు 12 గంటలకు పెంచుతాయా అన్నదే. దీనీపై చట్టం ఏమంటోంది.. అధికారులు ఏమని వివరణ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

కేంద్రం తెచ్చిన కొత్త లేబర్ చట్టాల్లో స్ప్రెడ్ ఓవర్ కాలాన్ని 12 గంటల వరకు పేర్కొంది. అంటే కంపెనీలు తమ అవసరాన్ని బట్టి రోజూ పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచవచ్చు. అయితే వారానికి మెుత్తం పని గంటలు మాత్రం గతంలో ఉన్న 48 గంటలుగానే ఉంచబడింది. అంటే గరిష్ట పని వేళల్లో మాత్రం కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఎవరైనా ఉద్యోగి వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే మాత్రం వారు అదనపు సమయానికి ఓవర్ టైమ్ పొందుతారని అధికారులు చెబుతున్నారు. అంటే దీని ప్రకారం ఉద్యోగి వారంలో కొన్ని రోజులు 8 గంటల కంటే ఎక్కువ పని చేసినప్పటికీ మెుత్తం పని వేళలు మాత్రం 48 గంటలే. 

చైనా, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు నిర్వహించిన సర్వేలో 9-9-6 పని విధానం ఆధునిక బానిసత్వంగా పేర్కొనబడింది. ఈ పద్ధతి ఉద్యోగి ఉత్పాదకత, పోటీతత్వం, ఆవిష్కరణను దెబ్బతీస్తాయని.. నెమ్మదిగా ఇది కంపెనీలకు నష్టం కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది. ఇప్పటికే భారతదేశంలోని కార్మికులు పని వేళల వల్ల ఎక్కువగానే ఒత్తిడికి లోనవుతున్నట్లు ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది.