సీఎం ఇలాకాలో మూడేండ్లుగా సాగుతున్న యూజీడీ పనులు

సీఎం ఇలాకాలో మూడేండ్లుగా సాగుతున్న యూజీడీ పనులు

గజ్వేల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వర్క్స్​ స్లోగా జరుగుతున్నాయి. ప్రారంభించిన 18 నెలల్లో కంప్లీట్​ కావాల్సిన పనులు మూడేండ్లు కావస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  సీఎం కేసీఆర్ ఇలాకాలోనూ అసంపూర్తి పనులతో తిప్పలు తప్పడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించినా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. 

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : గజ్వేల్ మున్సిపాలిటీలో 107 కిలో మీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్స్​ను మూడు విడతల్లో రూ.100 కోట్లతో  నిర్మంచాలని 2020 మార్చి లో పనులు ప్రారంభించారు. 18 నెలల్లో పూర్తి  చేయాలని గడువు పెట్టినా  ఆశించిన మేర పనులు జరగడం లేదు. దీంతో అంచనా వ్యయం పెరిగి  అదనంగా మరో రూ.15 కోట్లను మంజూరు చేశారు. అయినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో  మొత్తం 11 వేల ఇండ్లు ఉండగా, 60 వేల జనాభా ఉంది. ఇప్పటివరకు  మొత్తం 107 కిలో మీటర్ల లో దాదాపు 100 కిలో మీటర్ల మేర మెయిన్ లైన్ పనులు పూర్తి చేశారు.  ఐదు వేల మ్యాన్ హోళ్లకు గాను, ఇంకా రెండు వేల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంటర్ కనెక్షన్లు పనులు పెండింగ్ లో ఉన్నాయి.

క్వాలిటీపై ఆఫీసర్లకు కంప్లైంట్...​

మున్సిపాలిటీలోని యూజీడీ పనుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోవడం లేదని పలు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై  కలెక్టర్,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం కంప్లైంట్​ చేశారు. పనులు పూర్తయిన తరువాత మట్టిని తొలగించకపోవడంతో వర్షాలకు బురదమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వచ్చే వదేండ్ల కోసం ఏర్పాటు చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపిస్తే  భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఏర్పడతాయంటున్నారు. పాలక వర్గం, అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై ఏర్పాటు చేసిన మ్యాన్ హోళ్ల మూతలు పగిలిపోగా, మరికొన్ని చోట్ల భూమి కంటే ఎక్కువ ఎత్తులో ఉండి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా పనుల్లో జాప్యంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.

ప్రతిపాదనల్లోనే విలీన గ్రామాల్లోని పనులు!

గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో యూజీడీ పనుల అంశం ఇంకా ప్రతిపాదనల్లోనే ఉంది. విలీనమైన గుండన్నపల్లి, క్యాసారం, ముట్రాజ్ పల్లి, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్ , సంగుపల్లి ల్లో రెండో దశలో యూజీడీ పనులు చేపట్టాలని నిర్ణయించి దాదాపు రూ.48 కోట్ల తో ప్రతిపాదనలు రూపొందించారు. విలీన గ్రామాల్లో దాదాపు పది వేల మంది నివాసం ఉంటుండగా మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం  ముట్రాజ్ పల్లి, సంగాపూర్ లలో దాదాపు మూడు వేలకు పైగా ఇండ్ల నిర్మించారు. విలీన గ్రామాల్లో దాదాపు ఐదు వేల మీటర్ల మేర యూజీడీ పనులు నిర్వహించాల్సి ఉంది. 

నాణ్యతను పర్యవేక్షించాలి

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయి. చాలా చోట్ల వాటర్ పైప్ లైన్లు  దెబ్బతిన్నాయి. పనులు జరిగిన తర్వాత రోడ్ల రిపేర్లను పట్టించుకోకపోవడంతో వానాకాలం ఇబ్బంది అవుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు నాణ్యతపై దృష్టి పెట్టి త్వరగా పనులు పూర్తి చేసేలా చూడాలి. 

-  బూర్గోజు బ్రహ్మచారి, గజ్వేల్

పనుల్లో వేగం పెంచాం

గజ్వేల్ మున్సిపాలిటీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాం. నాణ్యతా లోపాలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం.  80 శాతానికి పైగా మెయిన్  పైప్ లైన్ పనులు పూర్తి చేశాం. మిగతా పనులను త్వరలో కంప్లీట్​ చేస్తాం. 

- విద్యాధర్, కమిషనర్, గజ్వేల్ మున్సిపాలిటీ