సారీ మమ్మీ.. ఏడ్వకు.. జాబ్ రావట్లేదనే బాధతో నిరుద్యోగి సూసైడ్

సారీ మమ్మీ.. ఏడ్వకు..  జాబ్ రావట్లేదనే బాధతో నిరుద్యోగి సూసైడ్

నాగర్ కర్నూల్, వెలుగు: ఏ జాబ్ వచ్చేట్టు లేదని.. మళ్లీ నోటిఫికేషన్ ఎప్పుడు పడ్తదో తెల్వదని.. అంత కాలం ఓపికవట్టలేనంటూ ఓ నిరుద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ లో ఉంటూ కూలి పని చేస్తున్న తల్లికి క్షమాపణలు చెప్తూ లేఖ రాసిపెట్టాడు. ‘‘సారీ మమ్మీ, సారీ చిన్న.. నువ్వు ఏడవకు మమ్మీ, నిన్ను ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి నేను ఉండను. ఇప్పటి వరకు అన్నీ మీకు చెప్పి చేశాను. ఇదొక్కటే చెప్పకుండా చేశాను.. నన్ను క్షమించండి” అని లేఖలో కోరాడు.

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన శివకుమార్(25) డిగ్రీ చేశాడు. నాలుగేండ్లుగా ప్రభుత్వ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నడు. తల్లి, తమ్ముడితో కలిసి బతుకుదెరువు కోసం మూడేండ్ల కింద హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. రెండేండ్ల కింద తండ్రి రాముడు క్యాన్సర్ తో మృతిచెందారు. ఒకవైపు పనులు చేసుకుంటూనే సర్కార్​ఇచ్చే నోటిఫికేషన్లకు దరఖాస్తులు చేస్తూ శివకుమార్ చదువుకుంటున్నాడు. కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్, ఈవెంట్లు అన్ని పాస్​అయ్యాడు. ఫైనల్ పరీక్ష రాసిన అతను ఇటీవల విడుదలైన ‘కీ’ లో మార్కులు చెక్ చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం లేదనే తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో గురువారం హైదరాబాద్​ నుంచి సొంతూరుకు వెళ్లాడు.

వంట చేసుకోవడానికి ఇంటి పక్కనే ఉండే మేనమామ వాళ్ల దగ్గర గ్యాస్​ సిలిండర్ తెచ్చుకున్నాడు. అయితే అదే రాత్రి ఇంట్లోఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారు. సిలిండర్ కోసం శుక్రవారం పొద్దున ఇంటికి వెళ్లిన మేనమామ ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో.. ఇంట్లోకి వెళ్లి చూడగా శివకుమార్ ఫ్యాన్​కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. పక్కనే అతను రాసి పెట్టిన సూసైడ్​ లెటర్ ఉంది. తనకు ఏ జాబ్ రావట్లేదని అందుకే చనిపోతున్నా అని అందులో పేర్కొన్నాడు. మళ్లీ నోటిఫికేషన్ ఎప్పుడు పడ్తదో తెలీయదు.

అంత వరకు ఆగే ఓపిక తనకు లేదని అందులో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, తల్లి ఇప్పటికి కూలీ పనికి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లి, తమ్ముడు తనను క్షమించాలని కోరాడు. శివకుమార్ మృతితో కొండ్రావుపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది.