వర్సిటీల్లో కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తరు?

వర్సిటీల్లో కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తరు?
  • కోచింగ్​పై మంత్రి సబితారెడ్డి ప్రకటన చేసి రెండు నెలలు
  • నిధులు కూడా ఇచ్చిన ఉన్నత విద్యామండలి
  • అయినా ఎక్కడా మొదలు కాని కోచింగ్ 
  • చూసిచూసి ప్రైవేటు సెంటర్ల బాట పడుతున్న స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: “పోటీ పరీక్షలకు త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. ఉద్యోగావకాశాలకు కావాల్సిన శిక్షణను యూనివర్సిటీల్లోనే ఇవ్వాలి. దీనికోసం వర్సిటీల్లో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయాలి. దీనికి ప్రభుత్వమే నిధులిస్తుంది” ఫిబ్రవరి 16న వీసీల మీటింగ్​లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన మాటలివి. రెండు నెలలు కావొస్తున్నా, ఇప్పటికీ ఏ వర్సిటీలోనూ పోటీపరీక్షల కోచింగ్ ప్రారంభం కాలేదు. అన్ని వర్సిటీల్లో కోచింగ్​కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినా, సర్కారు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రైవేటు బాట పడుతున్న అభ్యర్థులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు రిలీజ్ కానున్న నేపథ్యంలో, ఆరు సంప్రదాయ వర్సిటీల్లో స్పెషల్​గా  కోచింగ్ ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇదే విషయాన్ని వీసీల సమావేశంలో మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే ఆయా వర్సిటీలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిధులు కూడా అందించింది. 

కోచింగ్ ప్రారంభమయ్యాక మరిన్ని నిధులిచ్చేందుకు కౌన్సిల్ అంగీకరించింది. దీంతో వర్సిటీల్లో ప్రత్యేక సెల్స్​ ఏర్పాటు చేసి, స్పెషల్ ఆఫీసర్లనూ నియమించారు. ట్రైనింగ్ కు అవసరమైన బుక్స్​ను, హాల్స్ ను రెడీ చేసి​ టీచర్లనూ ఎంపిక చేశారు. ఈ ప్రాసెస్​ పూర్తయి నెలరోజులు దాటినా ఇప్పటికీ  ఏ వర్సిటిలోనూ కోచింగ్ మొదలు కాలేదు. ఉగాదికైనా ప్రారంభిస్తారని భావించినా అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. దీంతో వారు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఇప్పటికే మెజార్టీ అభ్యర్థులు వాటిల్లో చేరిపోయారు. కోచింగ్ ను అధికారికంగా సర్కారు పెద్దలే ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది. అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకేసారి స్టార్ట్ చేయాలని, సర్కారులోని కీలకమైన మంత్రితో ప్రారంభించాలని భావిస్తున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వాళ్లు ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడే కోచింగ్ ప్రారంభించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.