జాబ్ నోటిఫికేషన్స్ రాలేదని యువకుడి ఆత్మహత్య

జాబ్ నోటిఫికేషన్స్ రాలేదని యువకుడి ఆత్మహత్య

పెనుబల్లి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల జాప్యంతో మరో నిరుద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన నాగేశ్వరరావు (29)  పురుగుల మందు తాగి చనిపోయాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్​చేసిన అతడు ఐదేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. తల్లిదండ్రులు పెండ్లి చేసుకోమంటే జాబ్​వచ్చిన తర్వాతే చేసుకుంటానని చెప్పి తన తమ్ముడి పెండ్లి చేయించాడు. ఓ వైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే వ్యవసాయ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం తమ జామాయిల్​తోటలో పురుగు ​మందు తాగి పడిపోయాడు. కొడుకు ఎంతకు రాకపోవడంతో తండ్రి వెంకట్రామయ్య ఊళ్లో వెతికాడు. చివరికి జామాయిల్ తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న నాగేశ్వరరావును గమనించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు జామున అతడు మృతి చెందాడు. 
కేసీఆర్​ దిగిపోతేనే ఉద్యోగాలు వస్తయ్
రాష్ట్రంలో కేసీఆర్​దిగిపోతేనే ఉద్యోగాలు వస్తాయని, అప్పుడే తన కొడుకులా  ఎవరూ ఆత్మహత్య చేసుకోరని మృతుడి తండ్రి వెంకట్రామయ్య ఆవేదన చెందారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే అన్యాయమే జరిగిందని, తన కొడుకు చావుతోనైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని కోరారు.