అప్లికేషన్లకు మోక్షం కలుగతలేదు

అప్లికేషన్లకు మోక్షం కలుగతలేదు
  • అప్లికేషన్లు వేలల్లో... మంజూరు వందల్లో...
  • యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో నిలిచిన బీసీ లోన్ల పంపిణీ
  • రెండు జిల్లాల్లో 41,181 మంది అప్లై చేసుకుంటే 
  • ఇచ్చింది 1,725 మందికే... ఉద్యోగాలు రాక, 
  • స్వయం ఉపాధి లేక నిరుద్యోగుల ఇబ్బందులు
  • ఆఫీసుల చుట్టూ యువత చక్కర్లు

యాదాద్రి, వెలుగు : స్వయం ఉపాధి పొందాలనుకున్న బీసీ యువతకు లోన్లు ఇస్తామంటూ ప్రభుత్వం 2018లో ప్రకటించింది. రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు 80 శాతం, 70, 50 శాతం సబ్సిడీతో లోన్లు ఇస్తామని చెప్పింది. దీంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు అప్లికేషన్లకు మోక్షం కలగడం లేదు. దరఖాస్తులు వేలల్లో వస్తే కేవలం కొద్ది మందికే సగం సగం డబ్బులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో ప్రభుత్వం సాయంతో సొంతగా వ్యాపారం చేసుకోవాలనుకున్న వేలాది మంది నిరుద్యోగులకు నాలుగేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. 

యాదాద్రి, సూర్యాపేటలో 41,181 అప్లికేషన్లు

యాదాద్రి జిల్లాలో బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 7,096 మంది, బీసీ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 6,504 మంది, ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 581తో కలిపి మొత్తం 14,181 మంది నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో రూ. లక్ష లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 1,249 మంది, రూ.2 లక్షల కోసం 4,088, రూ.10 లక్షల లోపు లోన్ల కోసం 7,856 మంది అప్లై చేసుకున్నారు. వీరంతా పాడి పరిశ్రమ, ఆటోలు, షాపులు, కంపెనీలు ఏర్పాటు చేస్తామంటూ దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా  వ్యాప్తంగా లోన్ల కోసం 27 వేల మంది అప్లై చేసుకున్నారు. 

ఇచ్చింది 1,725 మందికే...

అప్లికేషన్లు తీసుకోవడం పూర్తి కాగానే రూ. లక్ష లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకున్న వారికి ముందుగా రూ. 50 వేల చొప్పున మంజూరు చేయాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో 2018 ఆగస్టులో హడావుడిగా 100 మందికి రూ. 50 వేల చొప్పున చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలు రావడంతో లోన్ల ప్రక్రియ నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో లోన్ల మంజూరు మరింత ఆలస్యమైంది. తర్వాత 2019 ఫిబ్రవరిలో మరో 455 మందికి రూ. 50 వేల చొప్పున మంజూరు చేశారు. ఈ లెక్కన రూ. లక్ష లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకున్న వారిలో 555 మందికి రూ. 50 వేల చొప్పున అందగా, మిగతా డబ్బులు ఇంతవరకు అందలేదు. అలాగే రూ. లక్ష కంటే ఎక్కువ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని అప్లై చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా మంజూరు కాలేదు. ఇక సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల లోన్లు కలిపి కేవలం 1,170 మందికే మంజూరు చేశారు.

ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు

యాదాద్రి జిల్లాలో 2019లో రూ. 50 వేల చొప్పున లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేసిన ఆఫీసర్లు ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్కరికి కూడా లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. యాదాద్రి జిల్లాలో ఇంకా 13,626 మంది, సూర్యాపేట జిల్లాలో 25,830 మంది లోన్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అటు ఉద్యోగాలు దొరకక, ఇటు స్వయం ఉపాధి లేక వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే తమకు లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేయాలని బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 2018లో ఎన్నికల ముందే లోన్లు మంజూరు చేశారని, ఇప్పుడు కూడా ఎలక్షన్లు వస్తేనే లోన్లకు మోక్షం కలుగుతుందేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.