డిగ్రీ చదివిన యువతకు రూ.5 వేల నిరుద్యోగ భృతి

డిగ్రీ చదివిన యువతకు రూ.5 వేల నిరుద్యోగ భృతి

డిగ్రీ పూర్తయితే రూ.5 వేలు.. పీజీ అయిపోతే నెలకు రూ.7,500 చొప్పున నిరుద్యోగ భృతి యువత బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్. ప్రతి పేద కుటుంబానికి నెలకు 6 వేల రూపాయల డబ్బు సాయం. నర్సరీ నుంచి Phd వరకు ఉచిత విద్య.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఓటర్లకు ప్రకటించిన వరాల జల్లులో కొన్ని కీలక స్కీమ్స్ ఇవి.

ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని ప్రధాన పార్టీలో హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పేదలకు కిలో రెండు రూపాయలకే కిలో గోధుమ పిండి, కాలేజీకి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు, ఎలక్ట్రానిక్ స్కూటర్లు వంటి హామీలతో మేనిఫెస్టోని ప్రకటిచింది. తాగా ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సుభాష్ చోప్రా, పార్టీ నేతలు అజయ్ మాకెన్, ఆనంద్ శర్మలతో కలిసి తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీలో గెలిపిస్తే గతంలో లోక్ సభ ఎన్నికల ప్రకటించిన న్యాయ్ స్కీమ్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పథకం కింద పేదవారికి నెలకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయం అందుతుంది.

కాంగ్రెస్ పార్టీ కీలక హామీలివి

  • డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతకు రూ.5 వేల నిరుద్యోగ భృతి
  • పీజీ చదివి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు రూ.7,500 సాయం
  • న్యాయ్ స్కీం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6 వేలు అందజేత
  • అమ్మాయిలకు నర్సరీ నుంచి Phd వరకు ఉచిత విద్య
  • ఎయిమ్స్ తరహా మరో ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు
  • ఢిల్లీలో కాలుష్య నివారణకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపు
  • అందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్
  • అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు
  • ఎన్నార్సీ అమలు నిలిపివేత
  • ఎన్పీఆర్ ఫార్మాట్ లో మార్పులు