నకిరేకల్, (వెలుగు): జీవనోపాధి కొరవడి నిరుపేదలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి జీవన విధ్వంసానికి గురవుతున్నారని, మెరుగైన జీతభత్యాల కోసం పట్టభద్రులు విదేశాలకు వెళ్లి ఎన్నో అవమానాలను, హింసను ఎదుర్కొంటున్నారని, వలసదారులది ఒడవని దుఃఖం అని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య అన్నారు. గురువారం అర్థశాస్త్ర విభాగం నిర్వహించిన 'అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం' కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. వలసదారులు ఆయాచోట్ల శ్రమదోపిడికి గురవుతున్నారని, ప్రభుత్వాలు వలసదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
అతిథులుగా పాల్గొన్న వైస్ ప్రిన్సిపాల్ నాగు, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ శ్రీనివాసాచారి వలస దారుల సమస్యలను విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమానికి అర్థ శాస్త్ర అధ్యాపకురాలు హరిత అనసంధానకర్తగా వ్యవహరించగా అధ్యాపకులు శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, శంకర్, రవీందర్, శివశంకర్, ఉపేందర్, సుభాషిణి, కార్యాలయ సిబ్బంది వెంకన్న, సుదర్శన్, కార్తీక్ విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు రూపొందించిన ఐదు ఉత్తమ పరాజెక్టులకు బెల్లి సాయిలు స్మారక నగదు పారితోషికాన్ని అందజేశారు.
