- రిజర్వేషన్ కలిసిరాని చోట పక్క డివిజన్లపై ఫోకస్
- మహిళా రిజర్వేషన్ఉన్నచోట తల్లి, భార్యలను దింపే ప్రయత్నం
- చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్‌కావడంతో ఆ సామాజికవర్గం డివిజన్లపై నజర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో తాజా మాజీ కార్పొరేటర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. తమ సొంత డివిజన్‌లో అవకాశం లేకపోవడంతో ఇతర డివిజన్‌లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల 60 డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో తాజా మాజీలు, ఆశావహుల్లో కొందరు నిరాశలో ఉండగా.. మరికొందరు ఎలాగైనా పోటీ చేయాలని తమకు గెలుపు అవకాశాలున్న, రిజర్వేషన్ కలిసొచ్చే డివిజన్లను వెతికే పనిలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ వచ్చిన దగ్గర తమ భార్యలు, తల్లి, కోడళ్లను దింపేందుకు ప్రధాన పార్టీల లీడర్లు కీలక నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఎస్సీ డివిజన్లపై దృష్టి
రామగుండం కార్పొరేషన్ మేయర్ పదవిని ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో ఆ పదవిని ఎలాగైనా కైవసం చేసుకునేలా ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య లీడర్లు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గతంలో మేయర్‌గా వ్యవహరించిన బంగి అనిల్‌కుమార్ డివిజన్ బీసీ జనరల్‌కి మారడంతో ఆయన మరో డివిజన్(ఎస్సీ జనరల్)పై దృష్టిపెట్టారు.
అలాగే కాంగ్రెస్మాజీ ఫ్లోర్‌లీడర్ మహాంకాళి స్వామి గతంలో ప్రాతినిధ్యం వహించిన డివిజన్ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఆయన ఎస్సీ జనరల్‌కు కేటాయించిన 46వ డివిజన్‌లో అంతర్గతంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇక మేయర్బరిలో ఉండే అవకాశాలున్న మరో ప్రముఖ డాక్టర్ దామెర అనిల్‌కుమార్ కూడా ఎస్సీ జనరల్‌కు కేటాయించిన డివిజన్‌లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
గెలిచే అభ్యర్థులపై కాంగ్రెస్ సర్వే..
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రజల్లో బలం ఉన్న, గెలిచే అవకాశం ఉన్న లీడర్ల గురించి అంతర్గతంగా సర్వే చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సర్వే చేస్తుండగా, దాని ఆధారంగానే అధికార పార్టీ నుంచి టిక్కెట్ ఇచ్చే అవకాశముందని పార్టీ నేతలు చెపుతున్నారు.
