
హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన ఇండియాలో.. వివిధ మతాల వ్యక్తిగత చట్టాల్లోని (పర్సనల్ లా) వివక్ష తొలగించిన తర్వాతే యూసీసీ అమలు సాధ్యమవుతుందన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టడీ సర్కిల్‌కు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. అన్ని మతాల వ్యక్తిగత చట్టాల్లో మహిళలపై వివక్ష ఉందని, కులాల అంతరాలు, సామాజిక వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించిన హక్కులకు అనుగుణంగా మతాల వ్యక్తిగత చట్టాలు లేవని తెలిపారు. మెజార్టీ మతం వ్యక్తిగత చట్టాలనే తమపై రుద్దుతారనే భావన మైనారిటీల్లో ఉందన్నారు.
ఇలాంటి అసమానతలు, అభద్రతా భావాల మధ్య తీసుకొచ్చే యూసీసీ.. మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని తెలిపారు. దీని ముసాయిదాను విడుదల చేయకుండా చర్చపెట్టడం అంటే.. భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే అని విమర్శించారు. బీజేపీ సర్కార్ వైఫల్యమే మణిపూర్‌లో మారణహోమానికి కారణమన్నారు. మెజార్టీ తెగ మైతీలు.. కుకీ తెగ ప్రజలపై దాడులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరించిందని ఆరోపించారు.