నోచుకోని బడ్జెట్ హామీలు

నోచుకోని బడ్జెట్ హామీలు
  • అమలు కోసం లక్షలాది మంది ఎదురుచూపులు
  • ఫీల్డ్ అసిస్టెంట్లను‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల్లోకి తీసుకోలే
  • రెగ్యులరైజ్ కాని కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు
  • ఇల్లు కట్టుకునే వారికి అందని 3 లక్షలు 

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గత బడ్జెట్ సెషన్ (మార్చి 15) లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఒకటి, రెండు రోజుల్లో అమలు చేయగలిగిన హామీలు కూడా నాలుగున్నర నెలలు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల్లోకి తీసుకోవడం మొదలు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్, సెర్ప్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకు సర్కార్ ఉద్యోగులతో సమానమైన జీతం, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.3 లక్షల సాయం,  వీఆర్ఏలకు పే స్కేల్, పోడు భూములకు పట్టాల వరకు అన్నీ వాగ్దానాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో లక్షలాది మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. 

మరోసారి ఆందోళనకు ఫీల్డ్ అసిస్టెంట్లు
‘‘ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటం. మరోసారి వారు పొరపాటు చేయొద్దు. ఎంతో మందికి ఎన్నో చేసినం. వారికి మాత్రం ఎందుకు చేయం’’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. సర్కారు ఉత్తర్వుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్​అసిస్టెంట్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి కలెక్టర్లకు, డీఆర్డీఏ పీడీలకు ఇప్పటి వరకు ఎలాంటి సర్క్యులర్ విడుదల కాలేదు. దీంతో ఉపాధి హామీ పథకంలో లక్షలాది మంది కూలీలతో పనులు చేయించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి కరువైంది. ఇక సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ రెగ్యులరైజేషన్ ను పక్కనపెట్టి సెర్ప్ లో పనిచేసే 4 వేల పైచిలుకు సిబ్బందితోపాటు మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రెగ్యులరైజ్ కాకపోయినా  ఏప్రిల్ నుంచే పెరిగిన జీతం వస్తుందని సెర్ప్ ఉద్యోగులు సంబురపడ్డారు. వేతనాల పెంపు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోద ముద్ర వేయలేదు. 

తీవ్ర నిరాశలో కాంట్రాక్ట్ ఉద్యోగులు
11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని సీఎం కేసీఆర్​ఇదివరకు ప్రకటించారు. వారిలో జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్లు 3,680 మంది, డిగ్రీ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు 811 మంది, పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు 443 మంది ఉన్నారు. వారేకాక వైద్య, ఆరోగ్య శాఖలో ల్యాబ్‌‌‌‌‌‌‌‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్సులు, డార్క్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు, క్యాథ్‌‌‌‌‌‌‌‌ల్యాబ్‌‌‌‌‌‌‌‌ టెక్నీషియన్లు, డెంటల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సర్జన్లు కలిపి సుమారు 3,000 మంది వరకు ఉన్నారు. పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ శాఖలో 823 మంది, మునిసిపల్‌‌‌‌‌‌‌‌ శాఖలో 732, పోలీసు శాఖలో 96, అటవీ శాఖలో 70, వ్యవసాయ శాఖలో 56 మంది ఉన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ 4 నెలలుగా నత్తనడకన నడుస్తుండడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు. ఇక సొంత జాగా ఉన్నవారికి ఏప్రిల్  నుంచే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ సాయం మంజూరు కాలేదు. 

వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వలే
వీఆర్​ఏలకు పేస్కేల్ ఇస్తామని, వృద్ధులైన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలిస్తామని సీఎం అనేక సార్లు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో దశలవారీగా ఆందోళనలు చేపట్టిన వీఆర్ఏలు జులై 25 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఇటు వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపడం, వీఆర్ఏలు సమ్మెలో ఉండడంతో రెవెన్యూ సేవలు స్తంభించిపోయాయి. ఇక, రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైక్​లను సబ్సిడీపై ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ స్కీమ్​లో అర్హతకు సంబంధించిన విధివిధానాలను అధికారులు ఇంకా రూపొందించలేదు.