ప్రభుత్వ రంగ బ్యాంకులను మోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టినది : ఎన్. శంకర్

ప్రభుత్వ రంగ బ్యాంకులను మోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టినది : ఎన్. శంకర్
  •     అందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 
  •     సేల్స్ మెన్ గా పని చేస్తున్నరు 
  •     అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్. శంకర్

బషీర్ బాగ్, వెలుగు : ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏఐబీఈఏ జాతీయ ఉపాధ్యక్షుడు, అఖిల భారత యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. శంకర్ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం హోల్ సేల్ గా అమ్మకానికి పెట్టిందని, అందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సేల్స్ మెన్ గా పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.

 కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాల్ లో శనివారం యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర  ప్రథమ సంయుక్త ప్రాంతీయ ద్వివార్షిక మహాసభలు ఏఐయూబీఈఏ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. రవీంద్రనాథ్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి బదులుగా, ధ్వంసం చేసేందుకు కేంద్రం పూనుకోవడం దుర్మార్గమని విమర్శించారు.  ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం, విలీనాలు చేయడంతో దేశంలో ఆర్థిక మందగమనం వేగంగా పెరుగుతుందని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా శక్తులన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.  సమావేశంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ హైదరాబాద్ జోన్ కె. భాస్కర్ రావు , యూబీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ హైదరాబాద్ జోన్ ఎ. రవి కుమార్, యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమద్ ఖాన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ హెడ్స్ ఎన్. శ్రీనివాస్ రావు, ఏఐబీఈఏ సీనియర్ నేతలు పాల్గొన్నారు.