న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ. 4,703 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ. 4,703 కోట్ల ప్రాజెక్టులకు  కేంద్ర కేబినెట్ ఆమోదం
  •     అహ్మదాబాద్‌‌ మెట్రోకు రూ. 2,169 కోట్లు మంజూరు
  •     ఏపీలో ఉద్యోగుల  మౌలిక వసతుల ప్రాజెక్టులకు  రూ. 2,533 కోట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సుమారు రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు ముఖ్య ప్రాజెక్టులకు ఈ నిధులను కేటాయించింది. అలాగే, మోదీ 12 ఏండ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడు అంశాలతో కూడిన ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. 

బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం మీటింగులో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందని తెలిపిన మంత్రి.. ఇందులో భాగంగా గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌‌లో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ (ఫేజ్ 2A) విస్తరణకు రూ. 2,169 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కోటేశ్వర్ రోడ్ నుంచి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎయిర్‌‌పోర్ట్ వరకు 6 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్‌‌లో మొత్తం ఐదు స్టేషన్లు ఉంటాయి. 

ఇది అహ్మదాబాద్, గాంధీనగర్ మెట్రో నెట్‌‌వర్క్‌‌ను 78 కిలోమీటర్లకు పెంచుతుంది.అలాగే, ఆంధ్రప్రదేశ్‌‌లోని అమరావతిలో ఉద్యోగుల మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రెండు ప్రాజెక్టులకు  కేబినెట్ ఆమోదం తెలిపింది.  దీని కోసం మొత్తం రూ. 2,533 కోట్లు కేటాయించింది. అందులో రూ. 1,299 కోట్లుతో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్(సీజీజీపీవోఏ),  రూ. 1,234 కోట్లతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) సదుపాయాలు కల్పించనున్నారు. ఈ భవనాలను పర్యావరణహితంగా, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌‌మెంట్(జీఆర్ఎహెచ్ఏ) 4- స్టార్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. 

మోదీ పాలనపై ప్రత్యేక తీర్మానం

వరుసగా 4,399 రోజులు ప్రధానిగా పనిచేసి రికార్డు సృష్టించిన మోదీని కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. 12 ఏండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానిని గౌరవిస్తూ, ఏడు అంశాలతో కూడిన ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. గత 12 ఏండ్ల పాలనలో దేశంలో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, చంద్రయాన్ వంటి శాస్త్రీయ విజయాలు, రైతుల సంక్షేమం , వికసిత్ భారత్ 2047 దిశగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని తీర్మానంలో కొనియాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రివర్గం అభిప్రాయపడింది.