అన్నదాతల కష్టాలను, వారి గొంతుకను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నల్లగొండను వేదికగా ఎంచుకున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు.నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై ఆ పార్టీ చీఫ్ కవిత ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయంతో పాటు.. రైతుకు గౌరవం ఇవ్వడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించారు.
రైతు భరోసా, రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కవిత ధ్వజమెత్తారు. పంట చేతికొచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదని.. మృగశిర కార్తె ప్రారంభమైనా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు విడుదల కాలేదని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అన్నదాతలు మళ్లీ అప్పులు, తాకట్టుల వైపు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో రవాణా భారాన్ని రైతులపైనే మోపడమే కాకుండా.. క్వింటాకు 6 కిలోల తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు వ్యవసాయ శాఖపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం.. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడుసార్లు రైతు భరోసాను ఎగ్గొట్టారని, రుణమాఫీ కూడా పూర్తి కాలేదని.. కేవలం ఎన్నికల సమయాన్నే చూసి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. రైతులు పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం నిద్ర లేస్తోందని కవిత దుయ్యబట్టారు.
ALSO READ : ఖమ్మం బాలికకు ప్రభుత్వమే చికిత్స అందించాలి...
నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కవిత ఆరోపించారు. జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని.. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్లగొండకు కూడా నీళ్లు ఇవ్వాలని కోరారు.
మరోవైపు అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామన్న హామీ ఎటు పోయిందని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే పెద్ద ఎత్తున అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తున్నారని.. ఆ భూముల రక్షణ కోసం రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు. 'రైతు డిస్కం' పేరుతో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు, విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని హెచ్చరించారు.
తెలంగాణ రక్షణ సేన అనే ఈ కొత్త పార్టీకి, ప్రజల పక్షాన నిలిచే తమ పోరాటానికి ప్రజలందరూ సలహాలు, సూచనలు అందించి మద్దతుగా నిలవాలని కవిత కోరారు.
