
- రూ.1.07 లక్షల కోట్లతో ఈఎల్ఐ స్కీమ్
- కొత్త కొలువులిచ్చే సంస్థలకు రెండేండ్లు ప్రోత్సాహం
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఓకే
- తమిళనాడులో 4 లేన్ రోడ్డుకు రూ. 1,853 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉపాధిని పెంచేలా ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్ఐఎస్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కోసం రూ.1.07 లక్షల కోట్లు కేటాయించింది. ఈపీఎఫ్‌వో నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాల ద్వారా రాబోయే రెండేండ్లలో 3.50 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
మంగళవారం ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. రూ.3 లక్షల కోట్లకు పైగా విలువచేసే పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్ఐఎస్)తోపాటు రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ (ఆర్‌డీఐ), నేషనల్‌స్పోర్ట్స్ పాలసీ–-2025, తమిళనాడులో పరమకుడి–-రామనాథపురం జాతీయ రహదారిని 4 లేన్లుగా విస్తరించడానికి కేబినెట్ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
ఉపాధికి ఊపు తెచ్చేలా ఈఎల్ఐ స్కీమ్
మాన్యుఫాక్చరింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు ఈఎల్ఐ స్కీమ్‌ను తీసుకొచ్చినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా వచ్చే రెండేండ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఈఎల్ఐ స్కీమ్‌లో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరినవారికి ప్రభుత్వం ఒక నెల జీతం ఇస్తుంది. కొత్త ఉద్యోగాలు సృష్టించినందుకు యజమానులకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఈ ప్రోత్సాహకాలు రెండేండ్లపాటు కొనసాగుతాయి. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కు మరో రెండేండ్లు అంటే నాలుగేండ్లపాటు ఇస్తుంది. తొలిసారిగా ఉద్యోగాలు పొందేటోళ్ల సంఖ్య కోటీ 92 లక్షల మంది.. లక్షలోపు జీతాలు వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.
ఉద్యోగాలు కల్పించే యజమానులకు 2 ఏండ్ల పాటు ప్రతి ఎంప్లాయ్‌మెంట్‌కు నెలకు రూ.3,000 వరకు ఇన్సెంటివ్ అందుతుంది. కనీసం 6 నెలలు వారి సంస్థల్లో ఉద్యోగ కల్పన కొనసాగించాలి. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను కల్పించేందుకు ఈఎల్ఐ స్కీమ్‌ను 2024–-25 కేంద్ర బడ్జెట్‌లో సర్కారు ప్రకటించింది. దీని మొత్తం బడ్జెట్ వ్యయం
రూ. 2 లక్షల కోట్లని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఖేలో భారత్‌నీతి’కి ఆమోదం
దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం, క్రీడాకారుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నేషనల్‌స్పోర్ట్స్ పాలసీ– -2025కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ‘ఖేలో భారత్‌నీతి’ అని పేరు పెట్టింది. ప్రపంచ క్రీడల్లో భారత్ ఐదో అతిపెద్ద దేశంగా ఎదిగేందుకు ఈ పాలసీ ‘వ్యూహాత్మక రోడ్ మ్యాప్’ అని అభివర్ణించింది. 2036 ఒలింపిక్స్‌లో భారత్ గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
తమిళనాడులో 4 లేన్ హైవేకు 1,853 కోట్లు
తమిళనాడులోని పరమకుడి-–రామనాథపురం హైవే(ఎన్‌హెచ్87) 4 లేన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 46.7 కిలో మీటర్ల పొడవైన హైవే నిర్మాణానికి రూ.1853 కోట్లను ఖర్చు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) ద్వారా ఈ రోడ్డును విస్తరించనున్నట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అవుతుందని, రోడ్ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ పెట్టుబడులు..
పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ (ఆర్‌డీఐ)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ స్కీమ్‌కు రూ.లక్ష కోట్ల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్‌డీఐలో ప్రైవేటు సెక్టార్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటు లేదా వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడమే ఈ పథకం లక్ష్యం.
వ్యూహాత్మక- అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆవిష్కరణలను వేగంగా ట్రాక్ చేయడానికి విద్యావేత్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమల మధ్య సహకారాన్ని ఆర్‌డీఐ స్కీం ప్రోత్సహిస్తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.