ఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)తో సహా సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మరో నలుగురు న్యాయమూర్తులను నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
#WATCH| Cabinet Briefing | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "The last decision is related to the strengthening of the Supreme Court... The number of judges in the SC has been increased from 33 to 37+1 (+1 is the CJI)... Since 2014, the number of judges has been… pic.twitter.com/HJkyuxXqXJ
— ANI (@ANI) May 5, 2026
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 37కు (భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) 4 పెంచేందుకు, 1956 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టాన్ని సవరించేందుకు, 2026 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం వల్ల.. సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేయడానికి వీలవుతుందని.. సత్వర న్యాయం బాధితులకు దక్కుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. 1950లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసిన సమయంలో.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా కేవలం ఎనిమిది మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండేవాళ్లు. క్రమక్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1956లో సీజేఐతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను మొదటిసారిగా 11కి పెంచారు. 1960లో 14కి, 1977లో 18కి పెంచారు.
►ALSO READ | జోసెఫ్ విజయ్ అనే నేను.. తమిళనాడు సీఎంగా మే 7న విజయ్ ప్రమాణ స్వీకారం !
1979 చివరి వరకు కేబినెట్ ఈ సంఖ్యను 15 మంది న్యాయమూర్తులకే మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత అప్పటి సీజేఐ అభ్యర్థన మేరకు ఆ పరిమితిని ఉపసంహరించుకున్నారు. 1986లో న్యాయమూర్తుల సంఖ్యను 18 నుంచి 26కి పెంచారు. 2009లో.. ఈ సంఖ్యను 26 నుండి 31కి పెంచారు. 2019లో న్యాయమూర్తుల సంఖ్యను చివరిసారిగా 31 నుంచి 34కు పెంచారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశ అత్యున్నత ధర్మాసనంలో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
