టెర్రరిజాన్ని సహించం.. ఢిల్లీ ఉగ్రదాడి క్రూరమైన, పిరికిపంద చర్య

టెర్రరిజాన్ని సహించం.. ఢిల్లీ ఉగ్రదాడి క్రూరమైన, పిరికిపంద చర్య
  • తీవ్రంగా ఖండించిన కేంద్ర కేబినెట్
  • దేశ ప్రజల భద్రతపై రాజీలేదని ప్రకటన 
  • మృతులకు సంతాపం తెలుపుతూ తీర్మానం 
  • టారిఫ్​ల నష్టాన్ని తట్టుకునేలా ఎక్స్ పోర్టర్లకు రూ. 25 వేల కోట్ల ప్రోత్సాహకాలు 
  • క్రిటికల్ మినరల్స్ రాయల్టీలో హేతుబద్ధతకు ఆమోదం 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడి ఘటన క్రూరమైన, పిరికిపంద చర్య అని కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. దేశ ప్రజల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, టెర్రరిజంపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బాంబ్ బ్లాస్ట్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 

బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల స్మారకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించింది. 

అనంతరం భారతీయులందరి భద్రత కోసం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తామని, జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంటూ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా అంతం చేస్తామని, ఈ విషయంలో జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తామని తేల్చిచెప్పింది. ప్రతికూల పరిస్థితిలో తక్షణమే స్పందించి, కలసికట్టుగా కదిలిన అధికారులు, భద్రతా బలగాలు, పౌరుల ధైర్యం, అంకితభావాన్ని కేబినెట్ అభినందించింది. 

ఉగ్రదాడి ఘటనను అత్యవసర అంశంగా భావించి వేగవంతంగా దర్యాప్తు చేపట్టిన భద్రతా సంస్థలు.. బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, స్పాన్సర్లను గుర్తించాయని, ఎలాంటి జాప్యం లేకుండా వారిని చట్టం ముందు నిలబెట్టాయని పేర్కొంది. పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వివరించింది.  

క్రిటికల్ మినరల్స్ రాయల్టీలో హేతుబద్ధత 

దేశీయంగా గ్రాఫైట్, సీసియం, రుబీడియం, జిర్కోనియం వంటి క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి పెంచేందుకు వీలుగా రాయల్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నాలుగు క్రిటికల్ మినరల్స్ బ్లాకులను వేలం వేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల ఈ నాలుగు మినరల్స్ తోపాటు వీటితో కలిసి ఉండే లిథియం, టంగ్ స్టన్, రీస్, నియోబియం వంటి ఇతర క్రిటికల్ మినరల్స్​ను కూడా అన్​లాక్
 చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. 

ఎగుమతిదారులకు రూ. 25 వేల కోట్ల ప్రోత్సాహకాలు 

ఇండియన్ వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్ లు వేసిన నేపథ్యంలో ఆ భారాన్ని తట్టుకునేలా ఎగుమతిదారులకు రూ. 25,060 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం ‘ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ మిషన్’లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో మొదలుకుని ఆరేండ్ల పాటు ఈ ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మిషన్ ను రెండు సబ్ స్కీమ్ లుగా నిర్యాత్ ప్రోత్సాహన్ (రూ. 10,401 కోట్లు), నిర్యాత్ దిశ (రూ. 14,659 కోట్లు) పేరుతో అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

 ‘‘నిర్యాత్ ప్రోత్సాహన్ సబ్ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకు ఇంటరెస్ట్ సబ్ వెన్షన్, కొల్లాటరల్ గ్యారంటీలు, ఈ–కామర్స్ ఎక్స్ పోర్టర్లకు క్రెడిట్ కార్డులు, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు క్రెడిట్ సపోర్ట్ వంటి చర్యలు తీసుకోనున్నారు. అలాగే నిర్యాత్ దిశ సబ్ స్కీమ్ కింద ఇంటర్నేషనల్ బ్రాండింగ్, ప్యాకేజింగ్, ట్రేడ్ ఫెయిర్లు, మార్కెట్ సన్నద్ధత, కాంపిటీటివ్ నెస్ వంటి అంశాల్లో సహకారం అందించనున్నారు” అని కేంద్ర మంత్రి తెలిపారు. 

వీటిలో ముఖ్యంగా అమెరికా టారిఫ్ ల ప్రభావం ఉన్న టెక్స్ టైల్స్, లెదర్, జెమ్స్, జ్యువెల్లరీ, ఇంజనీరింగ్, మెరైన్ ప్రొడక్టుల రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని చెప్పారు.