కొన్ని దేశాలు రూల్స్ ఉల్లంఘిస్తున్నయి..రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్

కొన్ని దేశాలు రూల్స్ ఉల్లంఘిస్తున్నయి..రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్

న్యూఢిల్లీ: కొన్నిదేశాలు అంతర్జాతీయ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మరికొన్ని దేశాలు తమ సొంత నిబంధనలను సృష్టించుకుని, వచ్చే శతాబ్దంలో ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నాయని తెలిపారు. ఆ దేశాల పేర్లను మాత్రం రాజ్ నాథ్ సింగ్ వెల్లడించలేదు. 

యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లకు సైనికులను అందించే మిలిటరీ చీఫ్స్ ఆఫ్ నేషన్స్ సమావేశంలో మంగళవారం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రధాన సంస్థల్లో సంస్కరణాలు తీసుకురావాలని ఆయన గట్టిగా వాదించారు. “కాలం చెల్లిన బహుపాక్షిక నిర్మాణాలతో నేటి సవాళ్లను ఎదుర్కోనలేం. 

సమగ్ర సంస్కరణలు తీసుకురాకుండా యునైటెడ్ నేషన్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. యునైటెడ్ నేషన్స్ జెండా కింద 180 మందికి పైగా భారత శాంతి సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. వారి ధైర్యం, నిస్వార్థం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది” అని పేర్కొన్నారు.