దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకోదు: నిర్మలా సీతారామన్

దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకోదు: నిర్మలా సీతారామన్

వాషింగ్టన్: దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె శనివారం వాషింగ్టన్ డీసీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈడీని రాజకీయంగా వాడుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఈడీలో మా జోక్యం లేదు. అది తన పని తాను చేసుకుపోతోంది’’ అని నిర్మల జవాబు ఇచ్చారు.

‘‘ఈడీ పూర్తి స్వతంత్రంగా పని చేస్తోంది. ఆధారాలు ఉంటేనే ఆ సంస్థ ముందుకువెళ్తుంది. ఎన్నో కేసులను ఛేదించిన ఘనత ఈడీకి ఉంది” అని చెప్పారు. జీ20 గ్రూపుపై స్పందిస్తూ.. ‘‘జీ20 గ్రూపులోని చాలా సభ్య దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపాం. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న టైమ్ లో మేం అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నాం. అందరితో కలిసి పని చేసి వాటిని పరిష్కరించాల్సి ఉంది” అని తెలిపారు. పశ్చిమ దేశాలన్నీ మళ్లీ బొగ్గు వైపు మళ్లుతున్నాయని చెప్పారు. ‘‘ఒక్క ఇండియానే కాదు. చాలా దేశాలు ఎనర్జీ ప్రొడక్షన్ కోసం బొగ్గును వినియోగిస్తున్నాయి. ఇందుకు గ్యాస్ అందుబాటులో లేకపోవడం, దాని కొనుగోలు భారం కావడం కారణం” అని పేర్కొన్నారు.