యూపీఏ.. ఓ దశాబ్దాన్ని వృథా చేసింది

యూపీఏ.. ఓ దశాబ్దాన్ని వృథా చేసింది
  • వాళ్లవి అవినీతి, కుటుంబ రాజకీయాలు : నిర్మల
  • అప్పుడు చేసిన మురికిని మేం శుభ్రం చేసినం
  • మణిపూరైనా, ఢిల్లీ అయినా.. ఎక్కడైనా మహిళల్ని 
  • కించపరిస్తే  తీవ్రంగా పరిగణించాల్సిందే
  • లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రసంగం

న్యూఢిల్లీ : అవినీతి, కుటుంబ రాజకీయాలతో యూపీఏ ఓ దశాబ్దాన్ని వృథా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. యూపీఏ హయాంలో చేసిన మురికిని తాము శుభ్రం చేశామని చెప్పారు. గత ప్రభుత్వాలు కలలను ప్రజలకు అమ్ముకునేవని, ప్రస్తుత పాలనలో ఆ కలలు నెరవేరుతున్నాయని తెలిపారు. ‘‘ప్రతి సంక్షోభం ఇప్పుడు ఓ అవకాశంగా మారింది. అత్యుత్తమ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణంతో మనం బతుకుతున్నాం. యూపీఏ హయాంలో ఇందుకు విరుద్ధంగా ఉండేది” అని అన్నారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ 
సందర్భంగా నిర్మల మాట్లాడారు.

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి గురించి స్పందిస్తూ.. వాళ్లు కలిసి కొట్లాడుతున్నారో, వాళ్లలో వాళ్లే కొట్లాడుతున్నారో కనుక్కోవడం కష్టమని సెటైర్ వేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. భవిష్యత్ అభివృద్ధిపై ఇండియా సానుకూల దృక్పథంతో, ఆశాజనకంగా ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా పాలనను మోదీ ప్రభుత్వం మార్చివేసిందని చెప్పారు. ‘‘అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చైనా లాంటి పెద్ద ఎకానమీ ఉన్న దేశాలు.. కన్స్యూమర్ డిమాండ్, వేతనాల్లో స్తబ్ధతకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయి” అని చెప్పారు. ‘‘2022లో ప్రపంచ ఎకానమీలో కేవలం 3 శాతం గ్రోత్ మాత్రమే నమోదైంది. 2023లో 2.1 శాతం తగ్గుతుందని ప్రపంచబ్యాంకు చెప్పింది. ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ వైపు చూడండి. 2013లో ‘ఇండియాలో ఉన్నది బలహీన ఆర్థిక వ్యవస్థ’ అని మోర్గాన్ స్టాన్లీ చెప్పింది. ఇదే మోర్గాన్ స్టాన్లీ ఇప్పుడు ఇండియా ఎకానమీని అప్‌‌గ్రేడ్ చేసింది. 9 ఏండ్లలో మా ప్రభుత్వ పాలసీలతోనే ఇదంతా జరిగింది. కరోనా ఉన్నా సరే ఇంప్రూవ్‌‌మెంట్ జరిగింది” అని వివరించారు.

ఎయిమ్స్‌‌ విషయంలో తప్పు తమిళనాడు ప్రభుత్వానిదే

తమిళనాడుకు చెందిన సెంగోల్‌‌ గురించి మాట్లాడుతూ.. ‘‘సెంగోల్‌‌ను ఒక మ్యాజియం లాంటి చోట పెట్టారు. అది తమిళనాడుకు అవమానం కాదా? దాన్ని లోక్‌‌సభలో సరైన చోట పెడితే అది సమస్య అయింది. ఇది తమిళులకు అవమానమా?” అని నిలదీశారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు లేవనెత్తిన అంశంపై స్పందిస్తూ.. ‘‘మధురైలో ఎయిమ్స్‌‌ను నిర్మించేందుకు జపాన్‌‌ నుంచి అప్పు తీసుకోవాల్సి రావడం సిగ్గు చేటని సీనియర్ సభ్యుడు అనడం బాధాకరం. మధురై ఎయిమ్స్‌‌ కోసం భూసేకరణను తమిళనాడు ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీంతో రూ.70 కోట్ల నుంచి రూ.700 కోట్లకు భూసేకరణ వ్యయం పెరిగిపోయింది. బడ్జెట్ రూ.1,200 కోట్ల నుంచి 1,900 కోట్లకు పెరిగింది. ఈ విషయంలో తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇక ఆసుపత్రి కోసం ఖర్చు చేయడం అనేది కేంద్రం బాధ్యత. ఈ విషయంలో ఎలాంటి లోటు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారమూ పడదు” అని స్పష్టం చేశారు. దీంతో సభ నుంచి డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీల నేతలు వాకౌట్ చేశారు. సభను కేంద్ర మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీంతో స్పందించిన నిర్మల.. ‘‘ఎందుకు వెళ్లిపోతున్నారు? తమిళనాడుపై ఇంకా మాట్లాడాల్సి ఉంది. వెళ్లకండి.. కనీసం బయట టీవీలోనైనా ప్రసంగం వినండి” అంటూ సెటైర్లు వేశారు. ‘‘అనాగరిక క్రీడ అంటూ జల్లికట్టును యూపీఏ టైమ్‌‌లో నిషేధించారు. అప్పుడు యూపీఏలో డీఎంకే కూడా భాగస్వామి. 2016లో జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది ప్రధాని మోదీనే” అని నిర్మల చెప్పారు. 

సభలో జయలలిత చీర లాగి.. హేళన చేశారు..

‘‘మహిళల్ని కించపరచడం, అవమానించడం అనేది మణిపూర్, రాజస్థాన్, ఢిల్లీ సహా ఎక్కడైనా ఆందోళనకరమే. తీవ్రంగా పరిగణించాల్సిందే” అని నిర్మల చెప్పారు. మణిపూర్ అంశాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి ప్రస్తావించడంపై స్పందిస్తూ.. ‘‘1989 మార్చి 25న జరిగిన ఘటనను కనిమొళికి గుర్తు చేయాలని అనుకుంటున్నా. తమిళనాడులో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత చీరను లాగారు. అది పవిత్ర సభ. అసెంబ్లీలోనే జయలలిత చీరను లాగారు. సభలో కూర్చున్న డీఎంకే సభ్యులు హేళన చేశారు. ఆమెను చూసి నవ్వారు. ఎగతాళి చేశారు. రెండేండ్ల తర్వాత జయలలిత తమిళనాడు సీఎం అయ్యారు. నాడు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష నేత చీరను లాగిన పార్టీ.. ఇప్పుడు ద్రౌపది గురించి మాట్లాడుతోంది” అని తీవ్రంగా మండిపడ్డారు. 

టమాటాలను అందుబాటులో ఉంచుతున్నం

ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని నిర్మల తెలిపారు.‘‘కందిపప్పును మొజాంబిక్ నుంచి, మినప్పప్పును మయన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్‌‌ క్రియేషన్ కోసం సేకరించాం” అని వివరించారు. ‘‘మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి టమాటాలు సేకరిస్తున్నాం. ఢిల్లీ, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు పంపుతున్నాం. ఆయా రాష్ట్రాలకు 8.84 లక్షల కిలోలను పంపాం. వచ్చే వీకెండ్‌‌లో ఢిల్లీ– ఎన్సీఆర్ రీజియన్‌‌లో మెగాసేల్‌‌ను ఎన్‌‌సీసీఎఫ్‌‌ ద్వారా నిర్వహిస్తున్నాం. రూ.70 కే కిలో టమాటాలను అమ్ముతాం” అని చెప్పారు. లక్నో, వారణాసి, కాన్పూర్ వంటి సిటీలకు త్వరగా అందించేందుకు వీలుగా నేపాల్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.