అదానీ షేర్ల పతనం వ్యవహారాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయి: నిర్మలా సీతారామన్

అదానీ షేర్ల పతనం వ్యవహారాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయి: నిర్మలా సీతారామన్

అదానీ, హిండెన్‌బర్గ్ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయన్నారు. ఈ అంశంపై  రిజర్వ్‌ బ్యాంకు చెప్పిన మాటలు విన్నామని.... దీనికంటే ముందే  బ్యాంకులు, ఎల్‌ఐసీ స్పందించాయన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని తెలిపారు. షేర్ మార్కెట్లను క్రమబద్ధీకరణకు నియంత్రణ సంస్థలు తగిన చర్యలు తీసుకుంటాయన్నారు. సెబీ ఈ  పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  వెల్లడించారు.

బడ్జెట్ తర్వాత ఆర్థిక శాఖ భాగస్వామ్య సభ్యులతో  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు.  అనంతరం అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.20వేల కోట్లు సమీకరణ కోసం చేపట్టిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ను గత బుధవారం వెనక్కి తీసుకుందన్నారు. దేశంలోని మాక్రోఎకనామిక్స్ ఫండమెంటల్స్.. దేశ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు. దీని వల్ల దేశ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

భారత్ ఎప్పటికీ అత్యంత నియంత్రణలో ఉన్న ఆర్థిక మార్కెట్‌నే కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించాలని సూచించారు. ఏ ఒక్క ఉదంతం వల్ల దేశీయ మార్కెట్లపై ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. తమ మార్కెట్ నియంత్రణాధికార సంస్థలు కొన్ని పాలనా పద్దతుల్లో కఠినంగా వ్యవహరిస్తుంటాయన్నారు. వీటివల్ల ఆర్థిక మార్కెట్ల పాలనపై సందేహాలు పడొద్దని సూచించారు. కొన్ని దశాబ్దాల్లో చాలా పాఠాలు నేర్చుకున్నామని.. దేశీయ మార్కెట్లను బలంగా ఉంచడంలో నియంత్రణ సంస్థలు చాలా నిజాయితీగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన పెట్టుబడుల రీసర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచనల నివేదిక ప్రస్తుతం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమై లక్షల కోట్లు నష్టపోతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికను గౌతమ్ అదానీ ఖండించారు. ఇది గ్రూప్‌పై దాడి కాదని... దేశంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.