
Cashless Treatment: ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూనే ఉన్నప్పటికీ దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే అలాంటి సమయంలో వాహనదారుల విలువైన ప్రాణాలను కాపాడటానికి కేంద్రం అనేక కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా ప్రమాద బాధితులకు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే సకాలంలో వైద్యం అందేలా చూసేందుకు సరికొత్త ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులకు రూ.లక్షన్నర వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందేందుకు వీలుకల్పించింది. అయితే ఇది ఎంపిక చేయబడిన ఆసుపత్రుల్లో యాక్సిడెంట్ తర్వాత 7 రోజుల లోపు వైద్య సేవలను పొందటానికి వెసులుబాటు కల్పించనుంది. రోడ్డు ప్రమాద బాధితుల క్యాష్ లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ మే 5, 2025 నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
మోటారు వాహనాన్ని నడుపుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైతే స్కీమ్ కింద నిబంధనల ప్రకారం వైద్య సేవలు ఉచితంగా అందించబడతాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ జనవరిలో వెల్లడించారు. దీనిని జాతీయ ఆరోగ్య సంస్థ పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్రాల హెల్త్ ఏజెన్సీల సహకారంతో పర్యవేక్షించనుంది. ఏ రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ స్కీమ్ వర్తించనుంది.
అలాగే స్కీమ్ కింద లేని ఆసుపత్రులకు బాధితులను తరలించినప్పుడు అత్యవసరంగా వారిని సాధారణ స్థితికి తీసుకురావటానికి మాత్రమే అనుమతించబడుతుంది. ఏటా దాదాపు రోడ్డు ప్రమాదాల్లో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొంటూ వారి ప్రాణాలను రక్షించటానికి చేస్తున్న ప్రయత్నంగా దీనిని పేర్కొన్నారు. అలాగే హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు గడ్కరీ వెల్లడించారు.